అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులు దాదాపు వెయ్యి ఎకరాలకుపైగా భూములను కల్వకుర్తి ప్రాం తంలో కొనుగోలు చేశారు. ఆ ల్యాండ్స్‌కు ధరలను పెంచేందుకే ముఖ్యమంత్రి కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు సమీపంలోనే వారి భూములున్నాయి. పేరుకు మాత్రమే ఫోర్త్‌సిటీ, ఫ్యూచర్‌సిటీ.. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. ఈ రంగంలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టిన చాలామంది రోడ్డునపడుతున్నారు. వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల ప్రాంతాల్లో రేవంత్‌రెడ్డి, ఆయన బంధువులు, సోదరులు పెద్ద ఎత్తున భూ దందాలకు పాల్పడుతున్నారు.
– ఆమనగల్లు సభలో కేటీఆర్
రంగారెడ్డి, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ)/ఆమనగల్లు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి సోదరులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పేరుతో భూదందా చేస్తూ.. ఇతరులను ఎదగనివ్వడంలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం ఆయన ఆమనగల్లు పట్టణంలో జరిగిన రైతు నిరసన దీక్షకు హాజరై మాట్లాడారు. జిల్లాలో ఫోర్త్‌సిటీ, ఫ్యూచర్‌సిటీ అంటూ పెద్ద ఎత్తున భూములను కొంటున్నారని.. ఇప్పటికే ఈ ప్రాంతంలో వారికి 1000 నుంచి 1500 ఎకరాల వరకు భూములు ఉన్నాయని, వాటికి ధరలను పెంచేందుకే కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి వరకు సుమారు 42 కిలోమీటర్ల వరకు 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేసేందుకు చర్యలు చేపట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్క ముఖ్యమంత్రి కుటుంబానికే పరిమితమైనదని.. ఇతరులు బాగు పడొద్దని వారు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో ఎంతోమంది రియల్ఎస్టేట్ వ్యాపారులు కోట్లాది రూపాయ ల పెట్టుబడులు పెట్టి గృహ నిర్మాణాలతోపాటు వెంచర్లు, విల్లాలను ఏర్పాటు చేశారన్నారు. సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాతో జిల్లాలో రియల్ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుదేలైందని, ఈ రంగాన్ని నమ్ముకున్న చాలామంది రోడ్డున పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో జిల్లాలో శరవేగంగా అభివృద్ధి పనులు జరిగాయని.. అనేక ఐటీసంస్థలు తమ బ్రాంచ్‌లను ఇక్కడ ఏర్పా టు చేశాయని గుర్తు చేశారు. 14 నెలల కాం గ్రెస్ పాలనలో ఏ ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడికి రాలేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు వాణీదేవి, నవీన్‌రెడ్డి, ఎమ్మెల్యే విజేయుడు, మాజీ ఎమ్మెల్యేలు మం చిరెడ్డి కిషన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, యువ నాయకులు కార్తీక్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
అన్ని వర్గాలకూ ధోకానే..?
రేవంత్‌రెడ్డి అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. ఆఖరుకు తాను పుట్టిన కల్వకుర్తి ప్రాంతాన్ని ..తన అత్తగారి ఊరైన మాడ్గుల ప్రాంతంలోని ప్రజలనూ పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత వారందరికీ ధోకా చేశాడన్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాల అభివృద్ధికీ రూపాయీ కేటాయించలేదన్నారు.
ఆంక్షలు విధించినా.. అంచనాలకు మించి..
ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మంగళవారం ఆమనగల్లులో నిర్వహించిన రైతు నిరసన దీక్షకు ప్రభుత్వం ఆంక్షలు విధించినా ప్రజలు మాత్రం అంచనా లకు మించి హాజరయ్యారు. ఈ దీక్షను మధ్యాహ్నం రెండు గంటల్లోపే ముగించాలని, 5000లకు మించి హాజరు కావొద్దని కోర్టు షరతులు విధించింది. మరోవైపు పోలీసులు కూడా అడుగడుగునా ఆంక్షలు విధించారు. దీక్ష శిబిరానికి వచ్చే రోడ్లలో బారికేడ్లను ఏర్పా టు చేసినా.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల నుంచి రైతులు, మహి ళలు, బీఆర్ఎస్ శ్రేణులు అధికంగా తరలి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ ఆధ్వర్యంలో రైతు దీక్షను నిర్వహించారు.
శ్రేణుల్లో జోష్..
రైతు నిరసన దీక్ష సక్సెస్ కావడంతో కల్వకుర్తి సెగ్మెంట్లోని బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. తుక్కుగూడ నుంచి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో వందలాది కార్లలో బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్‌తో ర్యాలీగా దీక్ష శిబిరానికి చేరుకున్నారు. ముందుగా తుక్కుగూడలో సబితారెడ్డికి స్వాగతం పలికారు. అక్కడ జెండావిష్కరణ చేసిన కేటీఆర్.. కందుకూరు మండల కేంద్రంతోపాటు కడ్తాల్లోనూ పార్టీ జెండాలను ఆవిష్కరించి ఆమనగల్లుకు చేరుకున్నారు. ఆమనగల్లులో ఆయనకు ఘనస్వాగతం లభించింది.
కేసీఆర్‌తోనే పాలమూరు పచ్చబడింది..
కేసీఆర్ హయాంలోనే పాలమూరు జిల్లా సస్యశ్యామలమైంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరు అండడంతో ఎడారిగా ఉన్న భూములన్నీ పచ్చని పంటపొలాలతో అలరారుతున్నాయి. సాగునీరుతోపాటు రైతులకు పెట్టుబడి సాయం, రైతుబీమా, ఉచిత విద్యుత్‌తో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వా రు తిరిగి తమ స్వగ్రామాలకొచ్చి వ్యవసాయం చేసుకున్నారు. అయితే, రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘పాలమూరు- రంగారెడ్డి’ని విస్మ రిస్తున్నారు. -నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిన ఆ పార్టీ ఏ ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చడం లేదు. ఓట్ల కోసం ఇండ్ల వద్దకు వచ్చే నాయకులను ముందు హామీలను నెరవేర్చాలని నిలదీయాలి. పాలమూరులో రేవంత్ సర్కారుకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
-శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి
గురుకులాల్లో అర్తనాదాలు
రేవంత్ సర్కార్ గురుకులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. అందులో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులు ఆకలి చావులకు గురవుతున్నారు. కలుషిత ఆహారాన్ని అందిస్తున్నారని రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ హ యాంలో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత విద్యను అందించాలనే సదుద్దేశంతో 1022 గురుకులాలను కేసీఆర్ ఏర్పాటు చేశారు. కానీ, రేవంత్ సర్కార్ వాటిపై శీతకన్ను పెట్టింది.
– ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
పుట్టిన ప్రాంతంపైనా నిర్లక్ష్యమే..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కల్వకుర్తి సెగ్మెంట్‌పైనా ఎలాంటి పట్టింపు లేదు. కేసీఆర్ హయాంలో మహాత్మాగాంధీ ఎత్తిపోతల ద్వారా కల్వకుర్తి, వెల్దండ, వంగూరు, మాడ్గుల ప్రాంతాలకు సాగునీరు అందింది. అలాగే, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం వరకు పూర్తైం ది. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఏ ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయడం లేదు. ఇచ్చిన హామీలన్నీ ఉత్తవేనా..?
– జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే
రైతు వ్యతిరేక కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి
రైతులు, ప్రజలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీకి ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు. అన్ని వర్గాల వారు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. 14 నెలలు దాటినా ఏ ఒక్కా హామీ సక్ర మంగా అమ లు కావడంలేదు. ప్రభు త్వ విధానాలను ఎండగట్టుతున్న కేటీఆర్‌కు ఉండగా ఉంటాం.
-గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి
హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేరడం లేదు. ఎన్నికల ముందు అలవి కాని హామీలిచ్చి.. పవర్లోకి వచ్చాక వాటిని పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ శ్రేణులు త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ఇంటింటికీ తిరిగి వివరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్న కేటీఆర్‌కు ప్రజలందరూ మద్దతుగా నిలిచి, అండగా ఉండాలి.
-ఉప్పల వెంకటేశ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్