వికారాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ)/షాబాద్ : ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)ను ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఉత్తదేనని తేలిపోయింది. ఎన్నికల ముందు ఆ పార్టీ నేతల మాటలు నమ్మి గెలిపించిన పేద, మధ్యతరగతి ప్రజలను రేవంత్ ప్రభుత్వం దగా చేసింది.
ఎన్నికల ముందు ఎవరూ ఎల్ఆర్ఎస్కు ఫీజు చెల్లించొద్దని చెప్పిన కాంగ్రెస్ సర్కారు.. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫీజును ఈ నెలాఖరులోగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్పై మాట తప్పిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గ కేంద్రాల్లో జరుగనున్న నిరసన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, మహే శ్రెడ్డిలతోపాటు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు పాల్గొననున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోనూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం విధించిన గడువును ఉపసంహరించుకుని ఉచితంగా క్రమబద్ధీకరించాలని .. లేదంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేసేలా పార్టీ అధిష్ఠానం శ్రేణులు దిశానిర్దేశం చేసింది. రేపు కలెక్టర్‌కు వినతిపత్రం అందించాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు.
Brs Flag
వికారాబాద్ జిల్లాలో పెండింగ్‌లో 11,181 దరఖాస్తులు..
వికారాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 11,181 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అనుమతిలేకుండా ఏర్పాటు చేసిన లే అవుట్లను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. అందుకోసం ఆగస్టు 31, 20 20 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలలపాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది.
అయితే ఓపెన్ ప్లాట్లు, నాన్ లే అవుట్‌కు సంబంధించి దరఖాస్తుదారులు రూ.1000 ఫీజు చెల్లించి డాక్యుమెంట్లను అందజేశారు. పెద్ద లే అవుట్ స్థలానికి సంబంధించి రూ.10 వేలు చెల్లించగా వివిధ కారణాలతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అయితే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి 11,063 దరఖాస్తులు వచ్చాయి.
తాండూరు మున్సిపాలిటీ నుంచి 12,138 దరఖాస్తులురాగా 4,300 దరఖాస్తులకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తికాగా, మరో 7,834 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వికారాబాద్ మున్సిపాలిటీ నుంచి వచ్చిన 3,972 దరఖాస్తుల్లో 54 పెండింగ్‌లో ఉండగా.. పరిగి మున్సిపాలిటీలో 2769 దరఖాస్తులు, కొడంగల్ మున్సిపాలిటీలో 406 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు గ్రామ పంచాయతీల్లో 118 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లాలో 4.50 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో..
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు(కల్వకుర్తి), మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం 4.50 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలి..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎల్ఆర్ఎస్ను తప్పు పట్టారు. తాము అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ ఫీజును రద్దు చేస్తామన్నారు. ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగుతున్నారని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు ఎందుకు డబ్బులు కట్టాలని కూడా అడిగారు. రాష్ట్ర ప్రజల జేబుల నుంచి రూ.20 వేల కోట్లు దోచుకునేందుకు కాంగ్రెస్ సర్కారు ఎల్ఆర్ఎస్ స్కీంను అమలు చేస్తుంటే డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడడంలేదు? మార్చి 31 లోగా ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని దరఖాస్తుదారులకు ఫోన్ కాల్స్ చేయడం.. ప్రజల రక్తాన్ని తాగడంకాదా ..?
– కే.శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు
మాట మార్చడం దుర్మార్గం
కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక మాట మార్చడం దుర్మార్గం. పేద, మధ్యతరగతి ప్రజలకు భారం కాకుండా రాష్ట్ర సర్కారే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ను ఉచితంగా క్రమబద్ధీకరించాలి. గతంలో తాము అధికారంలోకి రాగానే ఉచి తంగా చేస్తామని గొప్పలు చెప్పుకున్న నాయకులు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడంలేదు.
– తిరుపతిరెడ్డి, కొత్తగడి, వికారాబాద్
నమ్మించి మోసం చేయడమే..
ఎల్ఆర్ఎస్ను గతంలో ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఫీజు వసూలు చేయాలని నిర్ణయించడం తగదు. అధికారంలో లేనప్పుడు ఓ మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేయడం తగదు. ఎల్ఆర్ఎస్ను అడ్డుపెట్టుకొని ఫీజులు వసూలు చేయడం సరికాదు.
– రమేశ్‌బాబు, కొడంగల్ మున్సిపాలిటీ
ఉచితంగా క్రమబద్ధీకరించాలి..
ఎన్నికల ముందు చెప్పిన విధంగానే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలి. ఎల్ఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రజలపై రూ. 20 వేల కోట్ల భారం మోపడం ఎంతవరకు సమంజసం. గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తప్పుబట్టి ఇప్పుడు మీరు కూడా దోపిడీ చేస్తున్నారా..? 25లక్షల కుటుంబాలపై రూ.20 వేల కోట్ల భారం మోపితే ఊరుకోం. గతంలో ఎల్ఆర్ఎస్పై కోమటిరెడ్డి వేసిన కేసు ఏమైంది ..? వెంట నే ప్రభుత్వం ప్రజల నుంచి ఎలాంటి ఫీజు తీసుకోకుండా ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధీకరించాలి.
– బుగ్గప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు