అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ షురూ అయ్యింది. ఆయా పార్టీల ప్రచారపర్వం తుది అంకానికి చేరింది. ప్రచారం ఈ నెల 28వ తేదీతో ముగియనున్నది. మరో 10 రోజుల గడువు మాత్రమే ఉండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా స్టార్ క్యాంపెయినర్లు కూడా ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. అభ్యర్థులను ప్రకటించడంలోనూ, ప్రచారంలోనూ ముందున్న బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల ప్రచారంలోనూ ముందున్నది. జిల్లాలోని పరిగి, కొడంగల్, వికారాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొనగా, తాండూరు సెగ్మెంట్లో మంత్రి హరీశ్‌రావు బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈనెల 27న మంత్రి కేటీఆర్ తాండూరు రోడ్‌షోలో పాల్గొననున్నారు. అదేవిధంగా ఈనెల 22న తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల అభ్యర్థులకు మద్దతుగా.. ఈనెల 23న వికారాబాద్ సెగ్మెంట్లో సీఎం కేసీఆర్ ప్రచారంతోపాటు ప్రజాశీర్వాద సభల్లో పాల్గొని అభ్యర్థుల్లో గెలుపుపై మరింత ధీమాను పెంచనున్నారు. గతంలో వికారాబాద్ జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉండగా.. అనతికాలంలోనే బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదిగి, ఏ ఎన్నికలు జరిగినా విజయభేరి మోగిస్తున్నది. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ సెగ్మెంట్లలో పార్టీకి ఉన్న ప్రజాబలం చూసినా గులాబీ పార్టీకి తిరుగులేదనే చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీ అభ్యర్థుల గెలుపునకు సోపానాలు కానున్నా యి.
-వికారాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ)
కొడంగల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి పట్నం నరేందర్‌రెడ్డి గెలుపొందారు. ఈ సారి కూడా పార్టీ ఆయన్నే తమ అభ్యర్థిగా పోటీలో నిలిపింది. ఇక్కడ బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొన్నది. అయితే నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు గల ముదిరాజ్, యాదవులు బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతుండడం పట్నం నరేందర్‌రెడ్డికి కలిసొచ్చే అంశం. మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి విస్తృత ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సెగ్మెంట్‌ను మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. మంత్రి కేటీఆర్ కొడంగల్‌ను దత్తత తీసుకొని, సిరిసిల్లలా మార్చుతానని గత ఎన్నికల ప్రచారంలో కొడంగల్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సెగ్మెంట్‌ను దత్తత తీసుకుని దాదాపుగా రూ.2000 కోట్లకుపైగా నిధులతో అన్ని రంగాల్లోనూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలిపారు.
గతంలో గతుకుల రోడ్లు, గుక్కెడు నీటి కోసం వాగు లు, చెలిమల వద్దకెళ్లాల్సిన పరిస్థితి.. వానొస్తే పలు గ్రామాల్లోకి రాకపోకలు బంద్.. చిన్న జ్వరమొచ్చినా పాలమూరుకు పోయే ప్రజల కష్టాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చెక్ పెట్టింది. గ్రామ పంచాయతీల నుంచి మండలాలు, మండల కేంద్రాల నుంచి నియోజకవర్గ కేంద్రాలకు డబుల్ రోడ్లను వేయడంతోపాటు మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నది. సెగ్మెంట్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందడంతో ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని మరోసారి గెలిపించేందుకు కొడంగల్ ప్రజలు సిద్ధమయ్యారు. ఏ గ్రామానికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన రేవంత్‌రెడ్డి కొడంగల్ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదు. దీంతో ప్రజలు అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఈసారికూడా రేవంత్‌రెడ్డిని ఓడించాలని ప్రజలు నిర్లయించుకున్నారు.
గత ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి పైలట్ రోహిత్‌రెడ్డి కాం గ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రోహిత్‌రెడ్డి బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి మనోహర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ద్విముఖ పోరు మాత్ర మే జరుగనున్నది. మిగతా పార్టీలకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాం గ్రెస్ నుంచి స్థానికేతరుడు పోటీలో ఉండడం బీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చే అంశం. దీంతో స్థానికుడైన బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్‌రెడ్డికే ప్రజలు జై కొడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితోపాటు దేశంలో ఎక్కడాలేని విధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అస్ర్తాలుగా రోహిత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికెళ్లినా అన్ని వర్గాల ప్రజలు ఆయన్ను ఆదరిస్తున్నారు. అంతేకాకుండా వేల కోట్ల నిధులను తీసుకొచ్చి సెగ్మెంట్ రూపురేఖలను మార్చిన రోహిత్రెడ్డివైపే తాండూరు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. గత ఐదేండ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం రోహిత్‌రెడ్డి రూ. 3318 కోట్ల నిధులను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారు. ఇందులో నియోజకవర్గాభివృద్ధికోసం రూ.1,672 కోట్లు, సంక్షేమ పథకాల నిమిత్తం రూ.1,646 కోట్లను ఖర్చు చేశారు. మరోవైపు నియోజకవర్గం లో రోహిత్‌రెడ్డికి మద్దతుగా ఆయన తల్లి, వికారాబాద్ జడ్పీటీసీ ప్రమోదినీరెడ్డితోపాటు ఆయన సతీమణి ఆర్తిరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు.
గత ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించింది. గత ఎన్నికల్లో గెలుపొందిన కొప్పుల మహేశ్రెడ్డినే మరోసారి బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. అయితే పరిగిలో బీఆర్ఎస్-కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ ఉండనున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సబ్బండ వర్ణాల నుంచి వస్తున్న సంపూ ర్ణ మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి రెండోసారి కూడా గెలుపొందడం ఖాయమని తెలుస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ రూపురేఖలను మార్చివేశారు.
ఐదేండ్ల కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి మహేశ్‌రెడ్డి దాదాపుగా ప్రభుత్వం నుంచి రూ.2,500 కోట్ల మేర నిధులు తీసుకొచ్చారు. ప్రతి గ్రామం నుంచిమండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రం వరకు రోడ్ల ఏర్పాటుతోపాటు.. ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు, గురుకుల పాఠశాలలు తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాకుండా పల్లెబాట కార్యక్రమంతో గెలిచిన నాటి నుంచి ప్రజల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రజలు ఏ గ్రామానికెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. విస్తృత ప్రచారం చేస్తున్న ఆయనకు మరోసారి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు.
వికారాబాద్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మెతుకు ఆనంద్ గెలుపొందారు. ఈ సారి కూడా ఆయనే బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి గతరెండు పర్యాయాలు ఓడిపోయిన ప్రసాద్‌కుమార్ పోటీలో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ద్విముఖ పోరు ఉన్న ది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాలతో పోల్చితే ఎమ్మెల్యే ఆనంద్ నియోజకవర్గాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ అందేలా చర్యలు తీసుకుంటున్నా రు.
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను స్వయం గా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధానంగా వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అంతా తానై చూసుకుంటున్నారు. నియోజకవర్గంలో గులాబీ జెండాను మరోసారి ఎగురవేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఆయన సతీమణి సబితానంద్తోపాటు కౌన్సిలర్లు, సర్పంచులు ఆయా వార్డులు, గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.