కొడంగల్, సెప్టెంబర్ 5 : తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలకు మొదటి స్థానంతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ బలరాం రెండోసారి బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డును అందుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని డీటీడీవో కార్యాలయంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఇతరాత్ర విషయాల్లో ముందంజలో ఉన్నందుకుగాను పాఠశాలకు అవార్డు దక్కినట్లు తెలిపారు. గతంలో 2019 డిసెంబర్లో రంగారెడ్డి రీజియన్ స్థాయిలో కొడంగల్ గిరిజన గురుకుల పాఠశాల రోలింగ్ ట్రోఫీని పొందినట్లు తెలిపారు. 2018 సంవత్సరంలో కూడా బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డును అందుకోవడం, మరో మారు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గురుకులాల అదనపు కార్యదర్శి, అదనపు డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డితో అవార్డును అందుకున్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ పీ కల్యాణి పాఠశాలల అభివృద్ధిలో నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి కృషితోనే 100 శాతం ఉత్తీర్ణతతో పాఠశాలకు నం.1 స్థానం దక్కిందని, ఇందుకు కృషి చేసినవారందరికీ అభినందనలు తెలిపారు.
ఉత్తమ అవార్డుతో బాధ్యత పెరిగింది..
ఆదిబట్ల, సెప్టెంబర్ 5 : రాష్ట్ర ఉత్తమ అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వర్కాల పరమేశ్ అన్నారు. ఆయన సోమవారం ఉత్తమ రాష్ట్ర ఉపాధ్యాయుడిగా రాష్ట్ర ఉత్తమ అవార్డు ను నగరంలోని రవీంద్రభారతిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌లు కలిసి అందజేశారు. అవార్డుతో పాటు మోడల్ ప్రశంసాపత్రం, 10 వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరింత బాధ్యతతో విధులు నిర్వహిస్తానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ బడుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.