కొడంగల్ : మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో పట్టణ ప్రగతి 14వ ఆర్థిక సంఘం మ్యాచింగ్ గ్రాంట్స్ నిధుల క్రింద సీసీ రోడ్లు నిర్మాణాలకు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి వార్డుల వారీగా శుక్రవారం పనుల ప్రారంభానికి శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. మున్సిపల్ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని, ప్రస్తుతం రూ. 15కోట్లతో ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయని, ఆయా వీధుల్లో రూ. 55లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాబడ్డాయని, 15రోజుల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌తో పాటు మున్సిపల్ డీఈ యూనుష్ను ఆదేశించారు.
పనుల్లో నాణ్యత లోపించడం, ప్రజలకు ఇబ్బందుల కలిగిస్తే ఉపేక్షించేది లేదని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆయా వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సౌకర్యాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, కమిషనర్ నాగరాజు, కౌన్సిలర్లు మధుసూదన్‌యాదవ్, వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్, రమేశ్, సర్పంచ్‌లు సయ్యద్ అంజద్, పకీరప్ప, నియోజకవర్గ అధికార ప్రతినిధి టీటీ రాములుతో పాటు టీఆర్ఎస్ నాయకులు నవాజొద్దీన్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు రమేష్‌బాబు, సాయిలు, చాంద్‌పాషా, సిద్ధిలింగప్ప పాల్గొన్నారు.