యాచారం, నవంబర్20 : కూరగాయల సాగును పెంపొందించేందుకు రైతులు, అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. అధికారులతో కలిసి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో గురువారం ఆయన పర్యటించారు. చౌదర్పల్లి గ్రామంలో కాశమల్ల వెంకట రాములు అనే రైతు డ్రిప్ సాయంతో సాగు చేసిన వరిపంటను ఆయన పరిశీలించారు. పంట సాగుకు సంబందించిన పలు అంశాలను నేరుగా రైతును అడిగి తెలసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో కూరగాయల సాగుపై పైలట్ గ్రామాలుగా ఎంచుకున్న చౌదర్పల్లి, గడ్డమల్లయ్యగూడ, మొండిగౌరెల్లి గ్రామాల రైతులు, వ్యవసాయ, ఉధ్యాన శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలో కూరగాయల సాగును పెంపొందించాలన్నారు. తక్కువ నీటితో, తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలు పొందే ఉద్యానవన పంటల సాగును విస్తరింపజేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయంలో రాణించేందుకు రైతులు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు కే.వీ.ఎన్ రెడ్డి, భవాణి, గోపాల్, జిల్లా వ్యవసాయ అధికారిణి ఉష, జిల్లా ఉధ్యాణవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సురేష్, ఏడీఏ సుజాత, మండల వ్యవసాయ అధికారి రవినాథ్, సిబ్బంది, రైతులు ఉన్నారు.