బీఆర్ఎస్ ఏర్పాటుపై ఇతర రాష్ర్టాలకు చెందిన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, దేశాన్ని సైతం ప్రగతి పథంలో నడిపించేందుకు బీఆర్ఎస్తో దేశరాజకీయాల్లోకి అడుగుపెట్టారన్నారు. బీఆర్ఎస్ రాకతో దేశానికి మంచి రోజులు మొదలయ్యాయని తెలంగాణలోని వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న ఇతర రాష్ర్టాలకు చెందినవారు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు కేసీఆర్ దేశంలో చక్రం తిప్పి తెలంగాణలో అమలవుతున్న అన్ని పథకాలు దేశమంతా విస్తరించాలని ఉమ్మడి జిల్లాకు ఆనుకొని ఉన్న పొరుగు రాష్ర్టాల ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. కేసీఆర్ నాయకత్వంలో రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు తమకూ అందాలని ఆకాంక్షిస్తున్నారు.
తాండూరు/ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 6 : తెలంగాణ రాష్ట్రంలో రైతులు, పేదల కోసం ఉన్న అద్భుత పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రపంచ దేశాల్లో వెనుకబడి ఉన్న భారతదేశంలో ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు, ఆర్థిక ఇబ్బందుల నుంచి రైతులకు విముక్తి కలిగించేందుకు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పాటు కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఆర్థిక సాయం లాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ ప్రధానమంత్రి కావాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీని బీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపొందించి విజయ దశమి పర్వదినాన జాతీయ పార్టీగా ప్రకటించడంపై దేశంలోని పలు రాష్ర్టాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో భారత్ రాష్ట్ర సమితికి మంచి ఆదరణ, మద్దతు లభిస్తుందని.. తెలంగాణ దారిలో దేశం నడవాలని కోరుకుంటున్నారు. అలాగే ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలు తెలంగాణ అమలవుతున్నాయని ఇతర రాష్ర్టాలకు చెంది.. తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ ఆధికారులు, ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. విద్య, వైద్యం, తాగు, సాగు నీరు, సంక్షేమం విషయంలో దేశంలోని ఏ రాష్ట్రమూ తెలంగాణకు సాటిరాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో చేపట్టే సంస్కరణలతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదన్నారు. సంక్షేమం, అభివృద్ధితోపాటు శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. సర్కారు బడులు కార్పొరేట్‌కు దీటుగా పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా నామకరణం చేసి ముందుకు దూసుకెళ్తున్నారని స్పష్టం చేశారు.
తెలంగాణ పథకాలు అద్భుతం
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పుట్టిపెరిగిన నేను పెళ్లి తర్వాత కర్ణాటక రాష్ర్టానికి వెళ్లడంతో అక్కడి రైతుల సమస్యలు అర్థమవుతున్నాయి. అనేక మంది పేద ప్రజలు ఇబ్బందులతో అల్లాడి పోతున్నారు. అందుకు తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా రావాలి. పేదలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ను బీఆర్ఎస్(జాతీయ పార్టీ)గా రూపాంతరం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. దేశ అభివృద్ధి, పేదల బాగుకోసం శ్రమిస్తున్న కేసీఆర్‌కు ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుంది.
-గాయత్రి, , మదుకల్, గుల్బర్గా జిల్లా, కర్ణాటక రాష్ట్రం
బీఆర్ఎస్తో దేశంలో పెనుమార్పులు – పి.రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడంతో ప్రత్యేక రాష్ట్ర సాధనతోపాటు తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరిగింది. వ్యక్తిగత స్వార్థం లేకుండా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. తెలంగాణలో జరిగిన మార్పు దేశవ్యాప్తంగా జరిగేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో దేశ ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. పెను మార్పులు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, కుల వృత్తుల ప్రోత్సాహం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం చాల మంచి నిర్ణయం. దేశ అభివృద్ధికి బీఆర్ఎస్ తరఫున మాకు ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా సైనికుల్లా పనిచేస్తాం.
బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నాం – గంగారాం, రాజస్థాన్
భవిషత్పై ముందు చూపుగల కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. దేశంలో రైతులు, బీదల బాధలు తెలిసిన ఒకే ఒక నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్. అలాంటి నేత దేశ రాజకీయాల్లోకి రావడం ఎంతో సంతోషంగా ఉన్నది. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలు రైతుల బాధలు తీరుస్తాయి. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తం కావాలి. బీజేపీ రైతుల గురించి ఆలోచించడంలేదు. యువత కోసం పట్టింపు లేకపోవడంతో ఉపాధి కరువైంది. మత కలహాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశం బాగుండాలన్నా, తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలన్నా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి. అందుకు ప్రతి ఒక్కరూ కేసీఆర్‌కు సహకరించాలి.
కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడులు – ఆనంద్, ఉపాధ్యాయుడు (విజయనగరం జిల్లా)
తెలంగాణలో సర్కారు బడులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారయ్యాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తిస్థాయి విశ్వాసం కలిగింది. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పాఠశాలల మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు అందుతున్నాయి. తెలంగాణ పాఠశాలలు దేశానికే ఆదర్శం.
తెలంగాణలోసంక్షేమ వసతి గృహాలు దేశానికే దిక్సూచి – సుశీందర్‌రావు, డీఈవో (గుంటూరు వాస్తవ్యులు)
తెలంగాణలో పేదవిద్యార్థులందరికీ నాణ్యమైన విద్యనందించడం కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ వసతిగృహాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో వెయ్యికిపైగా రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. దీంతో విద్యారుల్లో పోటీతత్వం పెరిగింది. తల్లిదండ్రుల్లో కూడా విద్యార్థులను ఈ పాఠశాలల్లో చేర్పించాలన్న నమ్మకం కలిగింది. ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తుండటంతో ఈ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం పోటీ తీవ్రంగా నెలకొంది. ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థులంతా బాగా రాణిస్తున్నారు. దీంతో చదువు మానేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తెలంగాణ విద్య దేశానికే ఆదర్శం.
తెలంగాణ పోలీసు వ్యవస్థ అద్భుతం – ఉమామహేశ్వర్రావు, ఏసీపీ, ఇబ్రహీంపట్నం (విశాఖపట్నం)
తెలంగాణ పోలీసుశాఖలో చేపట్టిన అనేక సంస్కరణలతో ప్రస్తుతం ఆ శాఖ అద్భుతంగా ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యారు. దీంతో నేరాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. నేరాల అదుపులో దేశంలోనే తెలంగాణ పోలీసులు రెండో స్థానంలో ఉన్నారు. ఉద్యోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉంది.
కేసీఆర్ రావాలి.. పేదల గోస తీరాలి – మురళీరెడ్డి, షాపూర్ (కర్ణాటక రాష్ట్రం)
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గురించి చాలా విన్నాం. తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి తెలుసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ మా కర్టాటక రాష్ట్రంలో అమలు చేయాలని కోరుకుంటున్నాను. అందుకు కర్ణాటక రాష్ట్రంలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తాం. బీఆర్ఎస్ దేశంలో అధికారంలోకి వస్తే రైతులు, పేదల గోస తీరుతుంది. యువత విద్య, ఉద్యోగాల్లో పురోగతిని సాధిస్తారు. దేశంలో ఎంతోమందికి మేలు జరుగుతుంది.
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం – వరప్రసాద్‌రెడ్డి, వ్యవసాయాధికారి, ఇబ్రహీంపట్నం (కడప)
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతుల్లో మనోైస్థెర్యాన్ని నింపింది. వ్యవసాయం దండుగ అనుకున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించింది. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధును ఇతర రాష్ర్టాలవారు కూడా అమలుచేసే యోచనలో ఉన్నారు. వ్యవసాయ రంగంలో వచ్చిన సంస్కరణలతో రైతులు తెలంగాణలో రాజులుగా మారారు.