AICTE : దేశవ్యాప్తంగా గత ఏడాది 58 ఇంజనీరింగ్ కాలేజీలను యాజమాన్యాలు మూసేశాయి. దీనికి సంబంధించి ఆయా కాలేజీలకు ప్రభుత్వం కూడా అనుమతించింది. ఈ విషయాన్ని ఏఐసీటీఈ (ది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) తాజాగా వెల్లడించింది. ఏఐసీటీఈ అనుమతితో 2025-26లో దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేశారు. ఈ 58 కాలేజీల్లో మూడు ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలుకాగా, మిగతావి ప్రైవేటు కాలేజీలు. కాలేజీల మూసివేతకు యాజమాన్యాలు చేసుకున్న దరఖాస్తులతో ఈ అనుమతి లభించింది. దీని ప్రకారం ఈ 58 కాలేజీలు 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్లో కొత్త అడ్మిషన్లు తీసుకోలేదు.
కానీ, అప్పటికే కొనసాగుతున్న విద్యార్థులకు సంబంధించి వారి అకమిక్ కోర్సులు పూర్తయ్యే వరకు కాలేజీలు కొనసాగుతాయి. అంటే, సెకండియర్, థర్డ్ లేదా ఫైనలియర్ చదువుతున్న విద్యార్థుల పూర్తి కోర్సు పూర్తయ్యే వరకు కాలేజీలు పని చేస్తాయి. ఈ విషయంలో విద్యార్థుల భద్రతకు, భవిష్యత్తుకు ఆయా కాలేజీలు గ్యారెంటీ ఇవ్వాల్సిందే. అవసరమైతే విద్యార్థుల్ని మరో కాలేజీకి బదిలీ చేస్తారు. ఈ విషయంలో ఏఐసీటీఈ వారికి అండగా ఉంటుంది. ఆయా కాలేజీల్లో కోర్సులు పూర్తయ్యేలా చూస్తుంది. కొంతకాలంగా కాలేజీల్లో సరైన అడ్మిషన్లు లేకపోవడం, అలాగే, ప్రస్తుతం అకడమిక్ ప్రమాణాలు, మౌలిక వసతుల ప్రమాణాలకు అనుగుణంగా కాలేజీలు నిర్వహించలేనందున వాటిని మూసేస్తున్నట్లు ఆయా కాలేజీల యాజమాన్యాలు తమ అభ్యర్థనల్లో పేర్కొన్నాయి. ఈ ప్రక్రియను ఏఐసీటీఈ.. ప్రగతిశీల మూసివేతగా పేర్కొంది. మరోవైపు 2025-26 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 950కిపైగా టెక్నికల్, ఇంజనీరింగ్ కోర్సులు రద్దయ్యాయి.
విద్యార్థులు వీటిపై ఆసక్తి చూపకపోవడం, ప్రాధాన్యతలు మారడం, సరైన సిబ్బంది లేకపోవడం, మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల అనేక కోర్సులు ఆగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మూసివేతకు గురైన కాలేజీల వివరాలివి. యూపీలో 12, మహారాష్ట్రలో 12, మధ్యప్రదేశ్‌లో 8, తెలంగాణలో 4, పంజాబ్‌లో 4, ఏపీలో 3, రాజస్థాన్‌లో 3, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, హరియాణా, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో 2 చొప్పున కాలేజీలు, పుదుచ్చేరిలో ఒక కాలేజీని మూసివేశారు. ప్రతి ఏడాది ఇలా పలు కాలేజీలు దేశవ్యాప్తంగా మూసివేతకు గురవుతాయి. ఇక, ఈ ఏడాది ఎన్ని కాలేజీలు ఇలా మూసేయడానికి అనుమతి పొందుతాయో చూడాలి.