E25 Petrol : దేశవ్యాప్తంగా 25 శాతం ఇథనాల్ (Ethenol) కలిపిన పెట్రోల్ (E25) ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం (Union Govt) స్పష్టత ఇచ్చింది. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని తేల్చి చెప్పింది. ఈ వదంతుల నేపథ్యంలో వాహనదారుల్లో నెలకొన్న ఆందోళనలను నివృత్తిచేసే ప్రయత్నం చేసింది. E25 ఇంధనాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకువస్తున్నారన్న ప్రచారంలో వాస్తవంలేదని కేంద్రం స్పష్టంచేసింది.
వివిధ వాహన మోడళ్లపై ఈ25 మిశ్రమం అనుకూలతపై ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నాయని, పూర్తిస్థాయి నివేదికలు అందిన తర్వాతే దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టంచేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ20 (20 శాతం ఇథనాల్) పెట్రోల్ సురక్షితమైనదని, అది సమర్థవంతంగా పనిచేస్తోందని వారు తెలిపారు. ముడి చమురు దిగుమతులు తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ, చెరకు రైతులను ఆదుకోవడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోంది.
ఇప్పటికే నిర్ణీత గడువు కంటే ముందే భారత్ ఈ20 లక్ష్యాన్ని చేరుకుంది. అయితే ఈ20 పెట్రోల్ వాడకంవల్ల మైలేజీ తగ్గడం, పాత వాహనాల ఇంజిన్ల పనితీరు దెబ్బతినడం వంటి ఆందోళనలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే E25 వస్తుందనే వార్తలు వాహనదారుల్లో మరింత ఆందోళన రేకెత్తించాయి. ఇటీవల ప్రభుత్వం ఈ22 నుంచి ఈ30 వరకు ఇథనాల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఇవ్వడంతో ఈ25 త్వరలోనే వస్తుందనే ఊహాగానాలు పెరిగాయి.
అయితే ఈ20 తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా అది దశలవారీగా ఉంటుందని, వాహన తయారీ సంస్థల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. తప్పుడు వార్తలు నమ్మి ఆందోళన చెందవద్దని కేంద్రం ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.