‘సమైక్య రాష్ట్రంలో వచ్చీరాని కరెంట్‌తో అష్టకష్టాలు పడ్డాం.. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక కంటికి కునుకు లేకుండా బావుల వద్ద పడిగాపులు కాసినం. ఎడాపెడా కోతలతో పంటలకు నీళ్లు సరిపోక వ్యవసాయం ఆగమైంది. రాత్రిపూట పొలాల దగ్గరకు వెళ్లి పాములు, తేళ్లు కుట్టి ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయిండ్రు. సాగునీళ్లు అందక పంటలు పండక ఎంతోమంది రైతులు అప్పులపాలై ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది.
ఇలా దారుణమైన, దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతుల జీవితాల్లో వెలుగులు నింపిందే కేసీఆర్. స్వరాష్ర్టాన్ని సాధించడమే గాక ముందుచూపుతో 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసి వ్యవసాయానికి రంది లేకుంట చేసిండు. ఆయన వచ్చినంకనే కరెంట్ కష్టాలు తీరాయి’ అంటూ రైతాంగం స్పష్టంచేస్తున్నది. తెలంగాణ రాకముందు అస్తవ్యస్థంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను మెరుగుపర్చి రంది లేకుండా చేశారని గుర్తుచేసుకుంటున్నారు. ఇలా ఒక వ్యవసాయమే కాదు.. అన్ని రంగాలను గాడిన పెట్టి ‘పవర్ఫుల్ తెలంగాణ’గా నిలబెట్టిన కేసీఆర్‌ను.. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో బద్నాం చేయడం తగదని మండిపడుతున్నారు.
– న్యూస్ నెట్వర్క్ ( నమస్తే తెలంగాణ) , జూన్ 20
తెలంగాణ రాకముందు అరకొర కరెంట్‌తో రాత్రి, పగలు అన్నదాతలు పొలాల వద్ద పడిగాపులు కాసేటోళ్లం. స్వరాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడకూడదని కేసీఆర్ వ్యవసాయానికి నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేశారు. 70 ఏండ్ల కాలంలో కరెంట్ విషయంలో ఎవరూ సాధించలేనిది కేసీఆర్ సాధించి చూపించారు.
-పి. కుమార్‌యాదవ్, రైతు, కుమ్మరిగూడ, షాబాద్ మండలం
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత విద్యుత్తు వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి రైతులు, పరిశ్రమలకు నిరంతరం విద్యుత్తు అందించిన గొప్ప నేత కేసీఆర్. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నది. పరిశ్రమలకు పవర్హాలిడేల కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్‌దే.
-మాలెల వెంకటయ్య, శ్రీ విశాలాక్షి ఇండస్ట్రీస్ కులకచర్ల
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలోనే వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందింది. అంతకుముందు బావుల దగ్గర కరెంట్ ఎప్పుడు పోయేదో తెలువకపోతుండేది. కరెంట్ కోసం పొలాల దగ్గర నిద్రపోయిన రోజులు ఇంకా గుర్తున్నాయి. రాష్ట్రం వచ్చినంక కేసీఆర్ వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ అందించడంతో రైతులంతా ఆనందంగా వ్యవసాయం చేసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో త్రీ ఫేజు కరెంట్‌లో కోత విధిస్తుండటంతో పొలాలకు సరిపడా నీరు అందడంలేదు. విద్యుత్ విషయంలో కేసీఆర్ సార్‌ని బద్నాం చేయడం సరికాదు.
-శ్రీనూనాయక్, రైతు, కడ్తాల్ మండలం
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. పగటిపూటతో పాటు రాత్రిపూట సైతం విద్యుత్ కోతలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినంక కేసీఆర్ కరెంట్ కష్టాలు తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గృహ వినియోగదారులతో పాటు వ్యవసాయానికి 24గంటల నిరంతర కరెంట్ సరఫరా చేశారు. 70 ఏండ్ల కాలంలో ఏ ప్రభుత్వాలు, ఏ ముఖ్యమంత్రులతో కానీ పని కేసీఆర్‌తో సాధ్యమైంది. కరెంట్ విషయంలో కేసీఆర్‌ను బద్నాం చేయడానికి ప్రయత్నాలు చేయడం మంచి పద్ధతి కాదు. అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారు.
-ఎండీ చాంద్‌పాషా, హైతాబాద్, షాబాద్ మండలం
కేసీఆర్ విద్యుత్తు కొరతను అధిగమించి వ్యవసాయానికి నిరంతర కరెంట్‌ను అందించారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. కనీసం ఇండ్లకూ నాణ్యమైన విద్యుత్తు ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ పాలకులు లేరు. పదేపదే కరెంటు పోతుండడంతో పంటలకు సాగు నీరు అందడం లేదు. దీంతో ఇటు రైతులు, అటు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటినుంచైనా నాణ్యమైన విద్యుత్తును అందించాలి.
-పొట్టిపల్లి రాంరెడ్డి, రైతు, నాగులపల్లి,పెద్దేముల్ మండలం
తెలంగాణ రాకముందు కరెంట్ లేకపోవడంతో రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో ఒక రైతుబిడ్డగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు వ్యవసాయానికి 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేశారు. నాడు దండగ అన్న వ్యవసాయం కేసీఆర్ వచ్చినంక పండుగలా మారింది. కరెంట్, నీళ్లు లేక బీడుబారిన పొలాలు బీఆర్ఎస్ హయాంలో పచ్చని పంటలతో కళకళలాడాయి. కరెంట్ సరఫరా విషయంలో కేసీఆర్ రైతులకు ఎంతో మేలు చేశారు. గృహ వినియోగదారులకు సైతం 24గంటల కరెంట్ సరఫరా చేసి, విద్యుత్ కోతలకు చెక్‌పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది.
-సింగప్పగూడెం నర్సింహులు, కుమ్మరిగూడ, షాబాద్ మండలం
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును అందించారు. ముఖ్యంగా రైతుల పంటల సాగుకు 24 గంటల ఉచిత కరెంటును అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు మొదలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కేసీఆర్‌ని బద్నాం చేసుడు మాని.. విద్యుత్తు సరఫరాపై దృష్టి సారించాలి.
-ఎం.వెంకట, పెద్దేముల్