పెద్దఅంబర్‌పేట, మే 31: ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలు.. దశాబ్దాలు పడిన కష్టాలకు ముగింపు పలుకుతూ.. విదేశాల్లో ఉద్యోగ జీవితంలోకి అడుగులు పడే సమయంలో ఓ విద్యార్థిని కాలమే కాటేసింది. చదువులు పూర్తయ్యాయని స్నేహితులతో కలిసి సరదాగా గడి పేందుకు వెళ్లి.. ప్రమాదంలో పడిన దోస్తులను కాపాడి తాను మాత్రం మృత్యుఒడిలోకి చేరాడు. అమెరికా లూసియా టోరడో పార్కులోని సెబాగో సరస్సులో ప్రమాదవశాత్తు మునిగి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కవాడిపల్లి గ్రామ విద్యార్థి అనురూప్ రెడ్డి(22) మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం శాలిగౌరారానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి కోడూరు రాజేందర్‌రెడ్డి, దుర్గాభవాని దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
వీరు దశాబ్దాల కిందటే నగరానికి వలస వచ్చారు. దాదాపు ఐదేండ్ల కిందట అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి గ్రామంలోకి వచ్చి నివసిస్తున్నారు. వీరి మొదటి కుమారుడు ఆశ్రిత్‌రెడ్డి, రెండో కుమారుడు అనురూప్‌రెడ్డి. ఆశ్రిత్‌రెడ్డి ఉన్నత చదువుల కోసం 2023లో అమెరికా వెళ్లాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నవాడు అను రూప్‌రెడ్డి 2024లో అమెరికా వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో మే నెలలోనే ఎంఎస్ పూర్తిచేశాడు. ఉద్యోగానికి సైతం ఎంపికైనట్టు సమాచారం. వచ్చేనెల నుంచి ఉద్యో గంలో చేరాల్సి ఉన్నది.
ఆరుగురు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు అమెరికా టెక్సాస్ లూసియా టోరడో పార్కులోని సెబాగో సరస్సు వద్దకు వెళ్లారు. స్నేహితులకు ఈతరాదు. అను రూప్రెడ్డికి మాత్రం ఈత వస్తుంది. స్నేహితుల్లో ముగ్గురు నీటిలో ఆడుతూ ప్రమాదవశాత్తు నీట మునుగుతుండటాన్ని గమనించిన అనురూప్‌రెడ్డి.. ఒక్కొక్కరిని కాపాడి ఒడ్డుకు చేర్చాడు. చివరకు తన కాలికి చేపల వల చిక్కుకుని నీట మునిగిపోయాడు. స్థానికులు వచ్చి బయటకు తీసి స్థానిక దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అనురూప్‌రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారని, వారం రోజుల్లో మృతదేహాన్ని గ్రామానికి తరలిస్తారని తెలు స్తున్నది. ఈ మేరకు స్వచ్ఛంద సంస్థలు సహకారాలు అందిస్తున్నాయి.