షాబాద్, ఫిబ్రవరి 23 : కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లాలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఏర్పాటు చేసిన కంటి వెలుగు తమ జీవితాలకు కొత్త వెలుగునిచ్చిందని ప్రజలు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం 80 బృందాల ద్వారా ఆయా గ్రామాల్లో నిర్వహించిన కంటి వెలుగు క్యాంపుల్లో 16,166 మంది కంటి పరీక్షలు చేయించుకున్నట్లు సంబంధిత వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఉదయం 9 గంటల నుంచి క్యాంపులు ప్రారంభమవుతుండడంతో ప్రజలు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమున్నవారికి కంటి అద్దాలతో పాటు, మందులు ఉచితంగా అందజేస్తున్నారు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులను జిల్లా, డివిజన్ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి, ప్రజలకు చేసే కంటి పరీక్షలపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా తమకు ఉచితంగా కంటి పరీక్షలు చేయడం సంతోషకరమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 16,166 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,529 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,250 మందికి ప్రిస్కిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. గ్రామాల్లో 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని వైద్యులు చెబుతున్నారు.
141 గ్రామాలు, 34 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్‌పేట : అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చినవారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.
ప్రభుత్వం ఉచితంగా కంటిపరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. గురువారం జిల్లాలో 5280 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 805 మందికి రీడింగ్ గ్లాసులు ఇవ్వగా, 823 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 141 గ్రామాలు, 34 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో పాల్వన్‌కుమార్ తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు : సి.లక్ష్మి, తంగడిపల్లి, చేవెళ్ల మండలం
గత కొన్ని రోజుల నుంచి కంటి చూపు సమస్య ఏర్పడింది. దగ్గర్లోని టౌన్‌కు వెళ్లి చెక్ చేయించుకుందామనుకున్నా. ఇంతలోనే ప్రభుత్వం గ్రామాల్లోనే కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అద్దాలు, మందులు ఇస్తున్నారు. ఇది పేదలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం. నాకు పరీక్షలు చేసి మందులు, అద్దాలు ఇచ్చారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు మా తరఫున కృతజ్ఞతలు.
కేసీఆర్‌కు అండగా ఉంటాం – సుక్కమ్మ, శంకర్పల్లి
కంటి వెలుగు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. పేదలు ప్రైవేట్ దవాఖానల్లో చూపించునే స్థోమత ఉండదని గ్రహించి ప్రభుత్వం కంటి వెలుగును ప్రారంభించడం మా అదృష్టం. గ్రామంలోనే కంటి పరీక్షలు చేసి అక్కడే అద్దాలను ఇస్తుండ్రు. కేసీఆర్ సార్‌కు ధన్యవాదాలు. ప్రజలంతా కేసీఆర్‌కు అండగా ఉంటాం. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ మళ్లీ సీఎంగా ఉండాలి.