తుర్కయాంజాల్, ఆగస్టు 16 : ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, బస్తీ దవాఖానలతో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని పేద ప్రజలకు సత్వర వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బస్తీ దవాఖానలను ప్రారంభించామని తెలిపారు. బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
బస్తీ దవాఖానల్లో అవుట్ పేషంట్లకు సేవలను అందించడంతో పాటు స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్సను అందిస్తారని తెలిపారు. టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సెలింగ్‌ను సైతం బస్తీ దవాఖానల్లో ఇస్తారన్నారు. ప్రజలు కార్పొరేట్ దవాఖానల చుట్టూ తిరుగుతూ డబ్బును వృథా చేసుకోకుండా బస్తీ దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో మరిన్ని బస్తీ దవాఖానల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ, వైస్ చైర్పర్సన్ హరిత, ము న్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కోశికె ఐలయ్య, కౌన్సిలర్ వేముల స్వాతి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, బస్తీ దవాఖానల ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగజ్యోతి, వైద్య సిబ్బంది, నాయకులు కందాడి లక్ష్మారెడ్డి, సామ సంజీవరెడ్డి, గుండ్ల రాజీరెడ్డి పాల్గొన్నారు.