కొడంగల్ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని, కరువు కాలంలో కూడా ప్రజా సంక్షేమానికి ఎటువంటి లోటు రాకుండా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలో కళ్యాణలక్ష్మి, షాదీముబాకర్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీతో పాటు 12వ వార్డులో రూ. 30లక్షలతో ఎస్సీ సబ్‌ప్లాన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల వారి అభివృద్ధికి ప్రత్యేకంగా పథకాలను ఆదరిస్తుందన్నారు. అప్పట్లో పేదలు ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యేవారని కానీ నేడు అటువంటి పరిస్థితి లేకుండా కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకాలను అందిస్తూ పేదల ఇంట్లో కల్యాణ కాంతులు నింపుతున్నట్లు తెలిపారు.
పథకాన్ని అందుకున్న లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కొడంగల్ మండల పరిధిలో మొత్తంగా 45మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరు కాబడ్డాయని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసి నేరుగా ఇంటి వద్దకే వెళ్లి చెక్కులను అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాలకు సంబంధించి మొత్తంగా 43మందికి రూ. 34లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో ఎస్సీ సబ్‌ప్లాన్ క్రింద రూ. 30లక్షల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. దళిత వాడల అభ్యున్నతికీ ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ పథకంతో ఒక్కోక్కటిగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు.
నేరుగా ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడి వార్డుల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కోరిన మేరకు అభివృద్ధి పనులు కొనసాగుతుండటంతో ప్రజలు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని, మరింత అభివృద్ధికి గాను నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు, మధుసూదన్ యాదవ్, రమేశ్, సాయి ప్రసన్న, శంకర్‌తో పాటు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.