పెద్దేముల్, ఫిబ్రవరి 9 : అధికారుల నిర్లక్ష్యంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఎప్పుడో అందించాల్సిన చెక్కులు సకాలంలో ఇవ్వకపోవడంతో వాటి కాలపరిమితి దాటిపోయింది. వాటినే లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో చెక్కులు అందుకున్న ఆయా గ్రామాల లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్న సంఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ నెల 6వ తేదీ మండల రెవెన్యూ అధికారులు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహార్రెడ్డితోపాటు పలువురు మండల ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు కలిసి ఆయా గ్రామాల్లోని కొంత మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి వెళ్లిపోయారు. మిగిలినవాటిని గ్రామాల వారీగా అధికారులు పంపిణీ చేశారు. మండలానికి మొత్తం 122 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరయ్యాయి. అందులో సుమారు 17 చెక్కులు కాల పరిమితి దాటిపోయి ఉండగా, అధికారులు వాటిని గుడ్డిగా చూసుకోకుండా హడావుడిగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అధికారులు చేసిన తప్పిదంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెక్కులను లబ్ధిదారులు బ్యాంకుల్లోని తమ ఖాతాల్లో జమ చేయడానికి తీసుకెళ్లగా చెక్కుల కాల పరిమితి దాటిపోయిందని అధికారులు వారికి చెప్పడంతో అవాక్కయ్యారు. అయితే విషయం బయటకు రావడంతో రెవెన్యూ సిబ్బంది తక్షణమే లబ్ధిదారులను పిలిపించుకొని కొంత మంది చెక్కులను తేదీల మార్పు కోసం వెనక్కి తీసుకొన్నారు.
ఈ చెక్కులను ఆర్డీవో కార్యాలయానికి పంపినట్లు తెలుస్తున్నది. కనీసం తేదీలను కూడా చూసుకోకుండా కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా తహసీల్దార్ సిబ్బంది ఉదాసీనతగా వ్యవహరించడంతోనే జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మండల డిప్యూటీ తహసీల్దార్ మహేశ్‌ను వివరణ కోరగా కాల పరిమితి దాటిపోయిన చెక్కుల స్థానంలో వేరే చెక్కులను త్వరలో అందజేస్తామని, లబ్ధిదారులకు తగిన న్యాయం చేస్తామన్నారు. ఏది ఏమైనా కార్యాలయంలో పలువురు ఉద్యోగులు ఉండి కూడా తేదీలను చూసుకోకుండా లబ్ధిదారులకు ఇవ్వడం ఏమిటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.