ఆమనగల్లు, ఏప్రిల్29 : అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఆమనగల్లు మున్సిపాలిటీలోని గొర్రె కాపారుల సంఘం భవనానికి రూ.10 లక్షలు, కల్లు గీత కార్మికుల సంఘం భవనానికి రూ.10లక్షల ప్రొసీడింగ్ కాపీలను ఆయా సంఘాల నాయకులు తోట కృష్ణయాదవ్, చుక్క నిరంజన్గౌడ్కి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ గౌరవానికి ప్రతీక కుల సంఘాల భవనాలు అని ఆయన అన్నారు. ప్రభుత్వం కుల సంఘం భవనాలను నిర్మించడానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి కుల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని కమ్యూనిటీ హాల్‌లతో పాటు సంఘ భవనాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్‌గుప్తా, బీఆర్ఎస్ నాయకులు కమఠం వెంకటయ్య, బాలస్వామి, జోగు వీరయ్య, దశరథ్‌నాయక్ ఉన్నారు.
సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆమనగల్లు, ఏప్రిల్ 29: ఆమనగల్లు మండల పరిధిలోని మంగళపల్లి గ్రామ నాయకులు శనివారం మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంగళపల్లి నుంచి చెన్నారం గ్రామానికి వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం వలన వర్షాకాలం వస్తే వాగు ఉప్పొంగడం వలన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని, అదే విధంగా మంగళపల్లి గేట్ సమీపంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాలని వినతిపత్రాలు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సానుకూలంగా స్పందించి ఆయా అధికారులతో మాట్లాడినట్లు వైస్ ఎంపీపీ అనంతరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, ఉపసర్పంచ్ కొప్పు సాయిరాం, బీఆర్ఎస్ నాయకులు కమఠం వెంకటయ్య, గండికోట శంకర్, మురళి, తానయ్య, వెంకటయ్య, శ్రీశైలం, యాదయ్య, శివ పాల్గొన్నారు.