షాబాద్, మార్చి 25 : మారుమూల పల్లెలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామానికీ ఒక వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, హరితహారం నర్సరీ, తెలంగాణ క్రీడా ప్రాంగణం, కంపోస్ట్ యార్డు, రైతువేదిక, చెత్త సేకరణకు ట్రాక్టర్ తదితరాలతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దింది. పదేండ్లపాటు ఎటు చూసినా పచ్చదనంతో అలరారిన గ్రామాలన్నీ.. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో పూర్తి అధ్వానంగా తయారయ్యాయి.
ఇందుకు సాక్ష్యం మండలంలోని కక్కులూర్ గ్రామం. ఈ ఊరు ‘పల్లెప్రగతి’లో ఆదర్శంగా నిలిచింది. స్వచ్ఛతతో ముం దున్నది. కంపోస్ట్ యార్డు, పల్లెప్రకృతివనం, పారిశుధ్యం తదితర వాటిలో అందరితో శభాష్ అనిపించుకున్నది. కాగా, ప్రస్తుతం పల్లెప్రగతిలో చేపట్టిన ఏ ఒక్క దానినీ కాంగ్రెస్ సర్కార్, సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా మారింది.
నీళ్లు లేక ఎండిపోతున్న మొక్కలు
కేసీఆర్ హయాంలో పచ్చని మొక్కలతో కళకళలాడిన పల్లెప్రకృతి వనంలోని మొక్కలు.. ప్రస్తుతం సరిపడా నీరందక ఎండిపోతున్నాయి. కంపోస్ట్ యార్డు కూడా ఎండిపోయిన మొక్కల మధ్య వెలవెలబోతున్నది. వైకుంఠధామంలో స్నానాలు చేసే గదుల ఆవరణలో పిచ్చిమొక్కలు మొలవడంతో అక్కడ అడవిని తలపిస్తున్నది. ముంబై-బెంగళూరు లింకు జాతీయ రహదారి పక్కనే ఉన్న రైతువేదిక పచ్చని మొక్కల మధ్య కళకళలాడుతూ చూపరులను ఆకట్టుకునేది.
ఇప్పుడు ఆ మొక్కలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. గ్రామంలోని మురుగుకాల్వలు ఏరులై పారుతున్నాయి. గత 14 నెలలుగా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడం, ప్రస్తుత ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.