వికారాబాద్, జూన్ 12 : కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మండిపడ్డారు. గురువా రం ఆయన జుంటుపల్లి రైతులతో కలిసి కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. స్పందించిన కలెక్టర్.. అక్కడికొచ్చిన రైతులతో మాట్లాడి న్యాయం చేయాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, జిల్లా సివిల్ సప్లై అధికారిని ఆదేశించారు.
ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి వారం రోజుల్లో రైతులకు న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ .. ధాన్యాన్ని అడ్డికి పావు శేరు లెక్క కొంటున్నారని మండిపడ్డారు. తరుగు పేరుతో అన్నదాతను మోసం చేస్తున్నారని ..41 కిలోల కాంటాకు బదులు 43 కిలోలు తీసుకోవడమే కాకుండా.. రైస్‌మిల్లర్లు కూడా 50 బస్తాలు ఉన్న రైతు దగ్గర రెండు బస్తాలు, 70 బస్తాలుంటే 3 బస్తాలు, 100 బస్తాలకు 5 బస్తాలు, 150 బస్తాలకు 8 బస్తాలు కట్ చేయడం సరికాదని హెచ్చరించారు.
మాది రైతు ప్రభుత్వం అని గొప్ప లు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి అన్నదాత బాధ లు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. వారం రోజుల్లో రైతులకు న్యాయం జరుగకుంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జంటుపల్లి బాధిత రైతు లు రాంచందర్, శాంతప్ప, గోవర్ధన్‌గౌడ్, సోను, గోవింద్, బీఆర్ఎస్ నాయకులు రవిశంకర్, సిద్ధిఖ్ తదితరులు పాల్గొన్నారు.