రంగారెడ్డి, జూలై 28 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగార్థులకు వరం. అర్హతలకు తగ్గ ఉద్యోగాలు పొం దేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ)… చేవెళ్లలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఈ నెల 30న ఉదయం జాబ్‌మేళాను నిర్వహిస్తున్నది. ఉద్యోగ నియామకాలకోసం ఈ మేళాలో 20కి పైగా కంపెనీలు పా ల్గొంటుండగా వెయ్యిమందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉద్యోగ యాత్ర పేరుతో మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ మేళాను జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలని డీఈఈటీ నిర్వాహకులు కోరుతున్నారు.
తెలంగాణలోని యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేం జ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) దిక్సూచిలా నిలుస్తున్నది. డీట్ యాప్‌లో విద్యార్హత వివరాలతో రిజిస్టర్ చేసుకుంటే ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో అందజేస్తుంది. వివిధ కంపెనీలు ఈ ప్లాట్ఫామ్లో జాబ్ నోటిఫికేషన్లను నమోదు చేస్తుండడంతో ఉచితంగానే అర్హతలకు తగిన ఉద్యోగ వివరాలు ఉద్యోగార్థులకు వెంటనే తెలిసిపోతుంది. ఏదైనా ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను యాప్‌లో అప్లోడ్ చేస్తే..ఆ నోటిఫికేషన్ నిజమైందా? కాదా! అని నిర్ధారించుకున్నాకే డీట్ యాప్‌లో అందుబాటులో ఉంచుతుంది. దీనివల్ల ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలకు సైతం చెక్ పెట్టేలా డీట్ కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే యువతకు మరింత చేరువ కావడంలో భాగంగా డీట్ ‘ఉద్యోగాల యాత్ర’ పేరుతో జాబ్ మేళాలలను నిర్వహిస్తున్నది. తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల్లో ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు జాబ్ మేళాలను నిర్వహించ తలపెట్టింది. ఇందు లో భాగంగానే ఈనెల 30న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జాబ్ మేళాను డీట్ నిర్వహిస్తున్నది.
మహీంద్రా ఫైనాన్స్, టాటా స్ట్రైవ్, లులూ ఇంటర్నేషనల్ షాపింగ్‌మాల్స్, పోకర్ణ ఇంజినీర్స్ స్టోన్, మెడ్‌ప్లస్, ఢిల్లీవేరీ, అపోలో ఫార్మసీలు, కార్పోస్ బీపీవో వంటి ప్రముఖ కంపెనీలు 20 వరకు చేవెళ్లలో జరిగే జాబ్‌మేళాలో పాల్గొంటున్నాయి. ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి అక్కడికక్కడే సంస్థల ప్రతినిధులు ఆఫర్ లెటర్లను అందజేయనున్నారు. మేళాకు హాజరయ్యే వారు డీట్ నిర్దేశించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఉచితంగానే తమ పేర్లను నమోదు చేసుకొనవచ్చునని డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు. ఇతర వివరాల కోసం ఫోన్ నెం.8688519317 లేదా ఇ మెయిల్-help@ tsdeet.com, వెబ్సైట్-www.tsdeet.com ను సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు.