వర్షాలతో ఊరికి ఆదెరువైన చెరువులు జలకళను సంతరించుకున్నాయి. కొన్ని రోజులుగా భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో రంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. పలు గ్రామాల చెరువులు మత్తడి దుంకుతుండగా.. అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మొత్తం 2,083 చెరువులకు సమృద్ధిగా నీరు వచ్చి చేరింది. అందులో 203 చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఈ నెలలో సాధారణ వర్షపాతం 146.6మి.మీ కాగా.. ఏకంగా 310.6 మి.మీ నమోదైంది. ఇక ఈసారి యాసంగి సాగుకు నీటి ఇబ్బంది ఉండదని రైతులు మురిసిపోతున్నారు. మరోవైపు చేపల పెంపకానికీ ఎలాంటి ఢోకా ఉండదని, చేతినిండా పని దొరుకనున్నదని మత్స్యకార్మికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, జూలై 28 (నమస్తే తెలంగాణ) : ‘జిల్లాను వర్షం ముంచెత్తుతోంది.. దీంతో నిండుకుండల్లా కన్పిస్తున్న తటాకాలు.. వాటిల్లో అనేకం మత్తడిపోస్తున్న దృశ్యాలు.. అన్నదాతల్లో భరోసా నింపుతున్నాయి. జూలై నెలలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలన్నీ జలకళను సంతరించుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఉన్న మొత్తం 2,083 చెరువులన్నింటిలోకి సమృద్దిగా వర్షం నీరు వచ్చి చేరింది. 203 చెరువులు మత్తడి పోస్తున్నాయి. నిండుకుండల్లా కనబడుతున్న చెరువులను చూసి రైతాంగం ఆనందపడుతున్నది. సమృద్దిగా చేరిన వరద నీటితో ఈ ఏడాది భవిష్యత్తుపై బెంగ అనేదే లేకుండా పోయిందని మత్స్యకార్మికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.’
జిల్లాలో ఈ ఏడాది వానలు దంచికొడుతున్నాయి. దీనికితోడు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. జిల్లాలో గత కొన్నేళ్లలో ఎన్నడూలేని స్థాయిలో ఈసారి నీటి లభ్యత కనిపిస్తోంది. పంటల సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొనడంతో జిల్లాలో వానకాలం సీజన్లో ఊహించని రీతిలో పంటలు సాగవుతున్నాయి. 3.90లక్షల ఎకరాలు సాగవుతాయన్నది అంచనా కాగా..ఇప్పటికే సింహభాగంలో పంటల సాగు పూర్తయ్యింది. వరి అంచనాలకు మించి సాగుకానుండగా..పత్తి, కందులు వంటి పంటలకు సైతం ప్రస్తుత వర్షాలు ఉపయుక్తంగా మారాయి.
చిందేస్తున్న చెరువులు…
జూలై నెలలో జిల్లాలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. ఈ నెలల సాధారణ వర్షపాతం 146.6మి.మీ.లకుగాను 310.6మి.మీ.ల వర్షపాతం కురిసింది. 11.9మి.మీ.ల వర్షం అధికంగా కురిసింది. గత కొన్నేళ్లలో చూడని వరదను ప్రస్తుత జూలై మాసంలో జిల్లా ప్రజలు చూశారు. ప్రస్తుతం పడుతున్న వర్షాలు గత రికార్డులను అధిగమించడంతో జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలు సైతం నిండుతున్నాయి. జిల్లాలో మొత్తం 2,083 చెరువులు ఉండగా..25 శాతం లోపు 600 చెరువులు, 50శాతం లోపు 602 చెరువులు, 75 శాతం లోపు 499 చెరువులు, వంద శాతం మేర 19 చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మరో 203 చెరువులు పూర్తిగా నిండి మత్తడి పోస్తున్నాయి. వర్షాలకు చెరువుల్లోని చేపలు ఎదురెక్కుతున్నాయి. చెరువుల్లోకి త్వరలోనే ప్రభుత్వం చేప పిల్లలను వదలనుండడంతో మత్స్యకార్మికులకు సైతం ఏడాది పొడవునా ఉపాధి దొరకనున్నది.