చేవెళ్ల రూరల్, అక్టోబర్ 23 : ఈ సారి వర్షాలు సంమృద్ధిగా కురువడం.. వాతావరణం అనుకూలించడంతో పత్తి సాగు రైతులు ఆశించిన మేరకు ఫలితాలు వస్తున్నాయి. దీంతో మునుపటి కంటే ఉత్సాహంతో సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో కంటే ఈ సారి పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో సాగు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం పూత, కాత దశలో పత్తి పంట ఉండడంతో రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతో తెగుళ్లను నివారిస్తూ అధిక దిగుబడులు సాధించేలా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పత్తి పంట 100- నుంచి 105 రోజుల దశలో ఉన్నది.
పెరిగిన సాగు
చేవెళ్ల డివిజన్ పరిధిలో గతం సంవత్సరం కంటే ఈ సారి సాగు విస్తీర్ణం పెరిగింది. గత సంవత్సరంలో చేవెళ్ల మండలంలో 7,085.32, మొయినాబాద్ 1,478.13, షాబాద్ 8,318.18, శంకర్పల్లి 3,439.25 ఎకరాల్లో మొత్తం 20,321.08 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరంలో చేవెళ్ల మండలంలో 6,100, మొయినాబాద్ 1,850, షాబాద్ 12,500, శంకర్పల్లి 2620 ఎకరాల్లో మొత్తం 23,070 ఎకరాల్లో పత్తి సాగవుతున్నదని వ్యవసాయ అధికారులు తెలిపారు. గతంతో పోల్చితే ఈ సారి 2749 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పవచ్చు.
ప్రస్తుత పరిస్థితుల్లో యాజమాన్య పద్ధతులు
గులాబీ రంగు పురుగు.. తల్లి పురుగు లేత కొమ్మలపైన, పూ మొగ్గలపైన, లేత కాయలపై, రక్షక పత్రాలపైన గుడ్లు విరివిగా పెడుతుంది. దీంతో దూదిని బాగా నష్టపరుస్తున్నది.
తెగుళ్ల నివారణ కోసం..
ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను రైతులు మర్చుకోవాలి. మొదటగా థయోడికార్భ్ 15:5 గ్రా.లీ. లేదా కినాల్ పాస్ 2 మిల్లీ లీటర్లు.. రెండో దఫా.. ఎసిటమ్రిడ్, సైపర్ మేథ్రిన్ 2 మిల్లీ లీటర్లు కలిపి పిచికారీ చేస్తే తెగుళ్లను అరిక్టవచ్చు. బూడిద తెగులు ( గ్రే మిల్ట్యూ), కాయకుళ్లు తెగుళ్ల నివారణకు రైతులు వ్యవసాయ అధికారులను అనుసరించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి..
ప్రస్తుతం పంటలు పూత.. కాత దశలో ఉన్నాయి. వర్షాలు అధికంగా కురువడంతో భూగర్భ జలాలు అధికంగా పెరిగాయి. దీంతో ఈ సంవత్సరం పత్తి సాగుపై అధిక దిగుబడులు సాధించేలా రైతులు పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పుడూ వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలతో రైతులు తెగుళ్లు సోకకుండా చర్యలు తీసుకోవాలి.
– రమాదేవి, ఏడీఏ
50,133 ఎకరాల్లో పత్తిసాగు
మాడ్గుల : రైతులు పత్తిపంటను పెద్ద మొత్తంలో సాగు చేశారు. ఇక్కడి భూమి నల్ల, ఎర్ర నేలలు. దీంతో పత్తికి అనువుగా ఉండటంతో రైతులు అటువైపు మొగ్గు చూపారు. మండలంలోని 50,133 ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేస్తున్నారు. సరాసరి ఎకరాకు 7 క్వింటాలు పత్తి చేతికొస్తుందని రైతులు తెలిపారు. మండలంలోని ఎక్కువ మొత్తంలో పత్తి పండించే గ్రామాల వివరాలను అధికారులు వెల్లడించారు. అధికంగా మాడ్గులలో 8,379 ఎకరాలు, ఇర్విన్ గ్రామంలో 8,222 ఎకరాలు, సుద్దపల్లిలో 529 ఎకరాలు, ఆర్కపల్లిలో 4338 ఎకరాలు, అందుగులలో 4,114 ఎకరాలు, అవురుపల్లిలో 3276 ఎకరాలు, కలకొండలో 5432 ఎకరాలు, అన్నెబోయిన్పల్లిలో 1088 ఎకరాలు, గిరికొత్తపల్లిలో 2023 ఎకరాలు, కొల్కులపల్లిలో 1224 ఎకరాలు, అప్పరెడ్డిపల్లిలో 4183 ఎకరాలు, నాగిల్లలో 3507 ఎకరాలు, దొడ్లపహాడ్లో 852 ఎకరాలు, కొత్తబ్రాహ్మణపల్లిలో 502 ఎకరాలు, పాతబ్రాహ్మణపల్లిలో 2458 ఎకరాల్లో పత్తిపంటను సాగు చేస్తున్నారు. పత్తి పంట సంరక్షణ కోసం మండలంలో వ్యవసాయ అధికారి గౌతమ్ రైతులకు ఎప్పటికప్పుడూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను చేస్తున్నారు.
ఫలించిన రైతు అవగాహన సదస్సులు
వాతావరణంలో మార్పుల వల్ల వివిధ తెగుళ్లు, రోగాలతో పంట దెబ్బతింటుంది. ఈ క్రమంలో రైతులు ఏ రసాయనాలను వాడాలి, ఎంత మోతాదులో కలిపి పిచికారీ చేయాలో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. తద్వారా చీడపీడల నుంచి రైతులు పంటను సంరక్షించుకుంటున్నారు.