చేవెళ్లటౌన్/మొయినాబాద్, ఆగస్టు 24 : మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తే పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. శతాబ్ద కాలంగా పీడిస్తున్న అతి పెద్ద సమస్య పర్యావరణ కాలుష్యం. ఈ సమస్యతో సమస్త జీవరాశులపై ప్రభావం చూపుతున్నది. వినాయక చవితి సందర్భంగా నవరాత్రి పూజలు ప్రారంభం కానున్నాయి. సకల విజాలను తొలగించే వినాయక పూజ పేరుతో పర్యావరణానికి నష్టం కలిగే రంగు రంగుల వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
గ్రామాలు, పట్టణాల్లో ఎం త పెద్ద విగ్రహాలు పెడితే అంత గొప్ప అనే సంస్కృతి పెరిగిపోతున్నది. రంగుల వినాయక ప్రతిమలను తయారు చేయడానికి వాటిని తీర్చిదిద్దడానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), ఇనుం, కృత్రిమ రంగుల వాడకంలో పాదరసం, క్రోమియం, సీసం, కడియం, లెడ్, అర్సీనిక్ తదితర విషపూరిత రసాయనాలతో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు.
ఈ విగ్రహాలను నిమజ్జనం చేయడంతో ఆ నీరు కలుషితమవుతున్నది. వీటిని పశువులు తాగడంతో అవి అనారోగ్యానికి గురవుతున్నాయి. జలాల్లో ఉండే జీవరాసి మరణిస్తున్నది. ఆ నీటితో పండిన పంటల ఆహారం తీసుకోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
మూత్రపిండాల వ్యాధులు, కాన్సర్, జీర్ణకోశ, చర్మ, కాలే య సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. ప్లాస్టర్ ఆప్ పారిస్ ఇనుం, కృత్రిమ రంగులు జలాలను కలుషితం చేస్తున్నాయి. రంగురంగుల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో ఈ వ్యర్థాలు భూమిలో కలిసి పోకుండా అలాగే ఉండడంతో మృత్తికకు నష్టం కలిగిస్తున్నాయి. విగ్రహాల నిమజ్జనం సమయంలో చెరువుల్లో పూడిక చేరి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్నది.
కలుషితం కాని భూగర్భ జలాలు
మట్టి విగ్రహాలు ప్రకృతికి, పర్యావరణానికి మంచిది. భూ గర్బ జలాలు కలుషితం కావు. జలవనరులకు కూడా మే లు చేస్తాయి. మట్టి విగ్రహాలతో నీటి స్వచ్ఛత పెరుగుతుంది. మట్టి విగ్రహాల తయారీలో విద్యుత్, ఇందనం, యంత్రాల వాడకం, భూ తాపం ఉండదు. మట్టి విగ్రహాలు నిమజ్జనం చేసిన జలాలు సాగు, తాగు నీటికి ఉపయోగ పడుతాయి. మట్టి విగ్రహం స్వదేశీ వస్తువు, పవిత్రం, మట్టి విగ్రహాలు నీటిలో సులువుగా కరుగుతాయి.
మార్కెట్లో విరివిగా లభ్యం
స్వచ్చమైన నల్ల మట్టి, బంక మట్టితో తయారు చేసిన ప్రతిమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇద్దాం. మార్కెట్లో విరివిగా లభ్యం అవుతున్నాయి. తెలంగాణలో వినాయక విగ్రహాలను తయారు చేయడానికి నల్ల మట్టిని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి తయారు చేస్తున్నారు. మట్టి వినాయకులకు ఉన్న డిమాండ్‌ను మేరకు మహారాష్ట్రలో తయారు చేసిన ప్రతిమలను హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. హోల్‌సేల్ దుకాణాలను ఏర్పాటు చేసి భక్తులకు సరఫరా చేయడంతో పాటు చేసి రిటైల్ దుకాణాలకు విక్రయిస్తున్నారు.
మట్టి వినాయకులపై ఆసక్తి..
మొయినాబాద్‌లో మట్టి వినాయకులు అందుబాటులో ఉన్నాయి. భక్తులకు మట్టి వినాయకుల మీద అవగాహన పెరగడంతో ఆ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి శ్రద్ధ చూపుతున్నారు. భక్తుల నుంచి వస్తున్న డిమాండ్‌ను మట్టి మార్కెట్లో మట్టి వినాయకులు అందుబాటులో లభిస్తున్నాయి. మార్కెట్లో మట్టి వినాయకులను డిమాండ్ పెరగడంతో పెద్ద ఎత్తున మట్టి వినాయకులను తయారు చేస్తున్నారు. 5 ఫీట్ల నుంచి 7 ఫీట్ల వరకు అందుబాటులో మట్టి వినాయకులు లభ్యం అవుతున్నాయి. వీటి ధర రూ.25 నుంచి రూ.25 వేల వరకు ధర పలుకుతున్నది. పీవోపీతో చేసిన విగ్రహాల ధరల కంటే తక్కువ ధరలోనే వివిధ ఆకృత్తులో మట్టి వినాయక ప్రతిమలు లభ్యమవుతున్నాయి.
మండప నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలి
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు, మండప నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మండపాల వద్ద ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలి. విద్యుత్ తీగలను గమనించి మండపాలను ఏర్పాటు చేసుకోవాలి. నిమజ్జనానికి తరలించే సమయంలో విద్యుత్ వైర్లను చూసుకుంటూ ఊరేగింపు నిర్వహించాలని హెచ్చరిస్తున్నారు. మండపాల ఏర్పాటుకు ముందు సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. పోలీసు అధికారుల సూచనలు పాటించాలి.
మట్టి వినాయక ప్రతిమలతో..
మట్టి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తే అవి నీటిలో కరిగిపోతున్నాయి. ఎలాంటి నష్టం వాటిల్లదు. చెరువుల్లో నీటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. ప్రతి ఏడాది రంగులతో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం కారణంగా 10వేల టన్నుల రసాయన వ్యర్థాలు భూమిలో చేరుతున్నాయి. భూమిలో ఉన్న 71శాతం జలరాశిలో, 68 శాతం సముద్ర జలాలే 2శాతం మంచుతో కప్పబడి ఉన్నది. మిగిలిన ఒక శాతం నీటినే తాగడానికి, కాల కృత్యాలకు, వ్యవసాయ పనులకు భూమి మీద ఉన్న సమస్థ జీవరాశి వాటి అవసరాలకు పరిశ్రమలకు వాడుతున్నాం.
మిగిలిన ఈ ఒక్క శాతం నీటిని కూడా మనం కలుషితం చేస్తే మన వేలితో మన కంటిని పొడుచుకున్నట్లే. కర్రలు, వరిగడ్డి, మట్టితో సులభంగా నీటిలో కరిగిపోయేలా తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మట్టి వినాయకులపైన విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాద్యత ఉందని పలువురు పేర్కొంటున్నారు. వినాయక మండపాల్లో నిర్వాహకులు మట్టి వినాయకులను మాత్రమే ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మేదావులు కోరుతున్నారు.
ప్రజల్లో మార్పు వస్తున్నది
ప్రజల్లో చాలా మార్పు వచ్చిం ది. 20 ఏండ్లుగా పర్యావరణన పరిరక్షణ కోసం చేసిన పోరటంతో ప్రజల్లో మార్పు వస్తున్న ది. మొదట్లో పర్యావరణంపై అ వగాహన కల్పించేందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తే ఎవరూ వచ్చే వారు కారు. ప్రతి ఏడాది ప్రజల్లో మార్పు వస్తున్నది. ప్రస్తుతం స్వచ్ఛందంగా మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొదట వంద విగ్రహాలతో మొదలు పెట్టి ఇప్పుడు వెయ్యికి పైగా విగ్రహాలను పంపిణీ చేస్తున్నాను.
– రామకృష్ణారావు, పర్యావరణ అవార్డు గ్రహీత, చేవెళ్ల
మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకోవాలి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒ క్కరూ కృషి చేయాలి. పర్యావరణానికి నష్టం కలిగే రంగుల వి నాయక ప్రతిమలను ప్రతిష్ఠించకుండా మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేయాలి. ఇందు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. పర్యావరణంతో పాటు నీటిలో ఉండే జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. గ్రామాల్లో మట్టి వినాయక ప్రతిమలపై ప్రచారం చేసి వాటినే ప్రతిష్ఠించి పూజలు చేసే లా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
– ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, చేవెళ్ల