వికారాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల పదోన్నతుల్లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇందుకు కారణం జీహెచ్ఎం(గెజిటెడ్ హెడ్మాస్టర్) పోస్టులను మల్టీ జోనల్ పోస్టుగా మార్చడమే. స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా పదోన్నతుల్లో భాగంగా జిల్లాకు 94 మంది అలాట్ అయ్యారు. అయితే వారిలో జిల్లాకు చెందిన 17 మందే స్కూల్ అసిస్టెంట్లున్నారు. మిగతా 77మంది ఇతర జిల్లాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్లున్నారు. అందులో అధికంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వారున్నారు.
అయితే మల్టీ జోన్-1లో ఎక్కువగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వారే సీనియారిటీలో ముందుండడంతో జి ల్లా ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగింది. జిల్లాలో పదోన్నతులు పొందిన 94 మంది గెజిటెడ్ హెడ్మాస్టర్లలో ఇప్పటివరకు 90మంది విధుల్లో చేరగా, మరో నలుగురు జాయిన్ కావాల్సి ఉన్నది. మరోవైపు ప్రమోషన్లలో భాగంగా 97 మంది ఎస్జీటీలకు సీనియారిటీ ఉన్నా కోర్టు తీర్పుతో పదోన్నతులు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు బీఎడ్ పూర్తి చేసి ఎస్జీటీలుగా కొనసాగుతున్న టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత సీనియారిటీ జాబితాలో ఉన్న డీఎడ్ పూర్తి చేసిన ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు దక్కనున్నాయి.
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో భాగంగా జీహెచ్ఎం(గెజిటెడ్ హెడ్మాస్టర్)ల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో స్కూల్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించి గతంలోనే టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. స్కూ ల్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించి కటాఫ్ తేదీని జూన్ 1గా ప్రభుత్వం ప్రకటించింది. ఒకే బడిలో రెండేండ్ల సర్వీసు జూన్ 1 నాటికి పూర్తైన స్కూల్ అసిస్టెంట్లు ఉంటే బదిలీ కోసం జిల్లా విద్యాశాఖ అధికారికి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే ప్రభుత్వ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు ఇలా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్-2, జీవశాస్త్రం-1 (ఉర్దూ మీడియం), ఎస్ఏ హిందీ-3, పీడీ-1, ఎస్ఏ భౌతికశాస్త్రం-1, ఎస్ఏ సాంఘిక శాస్త్రం-2(తెలుగు-1, ఉర్దూ మీడియం1), ఎస్ఏ తెలుగు-2, ఎస్ఏ ఉర్దూ-1 పోస్టు ఖాళీగా ఉన్నాయి. లోకల్ బాడీ స్కూళ్లలోని స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలకు సంబంధించిన అంశం ఇంకా కొలిక్కి రాలేదు. అయితే స్కూల్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ పూర్తైన అనంతరం ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులివ్వనున్నారు.
త్వరలో అప్గ్రేడ్
అప్గ్రేడ్ అయిన భాషా పండితులకు త్వరలోనే పోస్టింగులు ఇచ్చేందుకు జిల్లా వి ద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే జిల్లాలో 338 మంది భాషా పండితులుండగా వారిలో 301 మంది అప్గ్రేడ్ అయ్యారు. ఎల్పీ తెలుగు 167 మంది లో 149 మందికి, ఎల్పీ హిందీ 163 మందిలో 145 మందికి, ఎల్పీ ఉర్దూ-ఏడుగురిలో ఆరుగురికి, ఎల్పీ సంస్కృతం ఒక పోస్టుకు ఒకరు అప్గ్రేడ్ అయ్యారు.
భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్లుగా, పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ పీడీలుగా అప్గ్రేడ్ అయ్యారు. అదేవిధంగా భాషా పండితులు ఇకపై స్కూల్ అసిస్టెంట్ తెలు గు, స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పోస్టులకు అర్హులుగా ప్రభు త్వం నిర్ణయించింది. ఎస్జీటీలు ఇకపై స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్ఏ జీవశాస్త్రం, ఎస్ఏ భౌతికశాస్త్రం, ఎస్ఏ గణితంగా పదోన్నతులు పొందనున్నారు.