మొయినాబాద్, మార్చి23: భవన నిర్మాణ కార్మికుల లేబర్ అడ్డాల వద్ద ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు కోరారు. ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటి కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లేబర్ అడ్డాల వద్ద కార్మికులకు మౌలిక సదుపాయాలు లేక గంటల తరబడి పనులకు కోసం ఎదురు చూస్తూ అడ్డాల మీద నిలబడుతున్నారని తెలిపారు.
మహిళా కార్మికులకు టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, వలస కార్మికులు పరిస్థితి మరీ దారుణంగా మారిందని పానుగంటి పర్వతాలు అన్నారు. బడా నిర్మాణ సంస్థలు కార్మికులకు తక్కువ కూలీలు ఇచ్చి 12-14 గంటల పాటు పనులు చేయించుకుంటున్నారని, వారి శ్రమను బడా నిర్మాణ సంస్థలు దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ రంగాల్లో వలస కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే వారి మృతదేహాలను సొంత గ్రామాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. భవన నిర్మాణ రంగాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి పనులు చేస్తున్నారని వారికి ఎలాంటి ప్రమాదాలు జరిగిన వారికి న్యాయం చేయకుండ పోలీసుల అండతో అక్కడి నుంచి పంపిస్తున్నారని అన్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ శాతం నిర్మాణ రంగ పనులు సాగుతున్నాయని, ఇలాంటి ఘటనలు జిల్లాలో బాగా జరుగుతున్నాయని పానుగంటి పర్వతాలు తెలిపారు. ఇలాంటి సమస్యలపై భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్లో చర్చించడం జరుగుతుందని అన్నారు. ఏప్రిల్ 21, 22న శంషాబాద్‌లో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభల సందర్భంగా ఏప్రిల్ 21న శంషాబాద్‌లో జరిగే ర్యాలీ, బహిరంగ సభకు జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కె రామస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్‌రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి నర్సింహా రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి కె శ్రీనివాస్, నాయకులు చందుయాదవ్, మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.