కేశంపేట, నవంబర్ 14 : ఇందిరమ్మ ఆత్మీ య భరోసా పథకం కింద అనర్హులను ఎం పిక చేసి లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపిస్తూ మండలంలోని పాపిరెడ్డిగూడవాసులు గ్రామసభను బహిష్కరించారు. ఉపాధిహామీ పనులకు ఆమోదం తెలిపేందుకు గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరైన స్థానికులు సంబంధిత అధికారులు నివేదికలు చదువుతున్న సమయంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద లబ్ధిదారుల వివరాలను చెప్పాలని డిమాండ్ చేయగా.. ఏపీవో అజీజ్అహ్మద్ వారి వివరాలను సభలో వెల్లడించడంతో గ్రామస్తులు ఆగ్రహించారు.
అసలు ఉపాధిహామీ పనులు చేయకుండా హైదరాబాద్లో ఉన్న వారికి డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నారని.. గతం లో ఇక్కడ పని చేసిన కార్యదర్శిని తప్పుదారి పట్టించి కొందరు నాయకులు కుట్రపూరితంగా ఇచ్చిన జాబితాను ఫైనల్ చేశారని మండిపడ్డారు. గ్రామంలో అర్హులను విస్మరించి అనర్హులకు లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి నచ్చిన వారిని ఎంపిక చేసి పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారని.. మేము ఎందుకు గ్రామసభను ఆమోదించాలని ప్రశ్నించారు. గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు మార్చే వర కూ గ్రామసభను ఆమోదించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేయడంతో అధికారులు చేసేదిలేక ఆ సభను వాయిదా వేశారు. గతంలో ఉన్న జాబితాను మార్చే వరకూ గ్రామసభను నిర్వహించేదిలేదని అల్టిమేటం జారీ చేస్తూ గ్రామస్తులు సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.