ప్రభుత్వ ప్రకటనతో క్రాప్ లోన్ మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మాతో కలిసి బ్యాంకు ల్లో రుణాలు తీసుకున్న వారివి మాఫీ అయ్యాయి. కానీ.. అన్ని అర్హతలున్నా మావి మాత్రం మాఫీ కాలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన రూ.2 లక్షల రుణమాఫీ వేలాది మంది అన్నదాతలకు నిరాశను మిగిలించింది. కొడంగల్ సెగ్మెంట్లో మొత్తం 52,395 మంది రైతులుండగా.. మూడు విడతల్లో కలిపి 17,436 మందికి మాత్రమే మాఫీ వర్తించిందని పేర్కొంటున్నారు. కాగా గ్రామాల్లో బుధవారం నుం చి వ్యవసాయాధికారులు చేస్తున్న ఫ్యామిలీ గ్రూపిం గ్ సర్వేను ప్రభుత్వం కాలయాపన కోసమే చేపట్టిం దని పలువురు మండిపడుతున్నారు.
కొడంగల్, ఆగస్టు 29 : రైతుల పంట రుణాలను మాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనది. ఆ ప్రక్రి యను తూతూమంత్రంగా చేపట్టింది. అర్హతలున్నా మాఫీ వర్తించకపోవడంతో అన్నదాతలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీతో చాలామంది రైతులకు లబ్ధి జరిగిందని.. ప్రస్తుత ప్రభుత్వం కొర్రీలు, నిబంధనల పేరు తో అన్యాయం చేస్తున్నదని మండిపడుతున్నారు. అసెం బ్లీ ఎన్నికల ముందు ప్రతి రైతుకూ రూ. రెండు లక్షల వరకు ఎలాంటి షరతుల్లేకుండా పంట రుణాలను మా ఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే మాట తప్పాడని.. లేనిపోని అనేక నిబంధనలు, మెలికలు పెట్టి వేలాది మంది అన్నదాతలను ఆగం చేస్తున్నడని ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. ప్రభుత్వం మూడు విడతలుగా చేసిన రుణమాఫీలో కొడంగల్ నియోజకవర్గంలో 30 శాతం మందికే రుణమాఫీ అయ్యిందని అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం స్పష్టమవుతున్నది. దీంతో మాఫీ కాని అన్నదాతలు బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అన్ని అర్హతలున్నా మా రుణాలు ఎందుకు మాఫీ కాలేదని వ్యవసాయాధికారులను ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 52,395 మంది రైతులుండగా.. అందులో మొదటి విడత రుణమాఫీలో 9,604 మంది రైతులకు, రెండో విడతలో 6,057 మందికి, మూడో విడతలో 1,775 మంది రైతుల రుణాలు మాఫీ అయినట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. రూ.2 లక్షల పైగా అప్పు ఉన్న రైతులు మిగిలిన నగదును చెల్లిస్తేనే.. రూ. 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని బ్యాంకర్లు, వ్యవసాయాధికారులు చెప్పడంతో పై మొత్తాన్ని చెల్లించినా మా రుణాలు మాఫీ కాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యామిలీ గ్రూపింగ్ సర్వేతో వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు. రుణమాఫీ వర్తించని, రేషన్‌కార్డు లేని రైతుల వివరాలను సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయాధికారుల వద్ద రైతులకు సంబంధించిన పూర్తి వివరాలున్నా అర్హులకు రుణమాఫీ కాలేదని.. ఇప్పుడు నిర్వహిస్తున్న ఫ్యామిలీ గ్రూపింగ్ సర్వేతో అర్హత
కలిగిన అందరి రుణాలు మాఫీ అవుతాయా..? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ అంశాన్ని కాల యాపన చేసేందుకు ఈ సర్వేను చేపట్టిందని పలువురు రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరి రుణాలను ఎలాంటి షరతుల్లేకుండా మాఫీ చేయాని డిమాండ్ చేస్తున్నారు.
పట్టాదారు పాసు పుస్తకం ఉన్న ప్రతి రైతుకూ ఎలాంటి షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. మా ఇంట్లో నేను, నా భార్య, ఇద్దరు కొడుకులం కలిపి బొంరాస్‌పేట ఎస్బీఐలో రూ. 6.54 లక్షల పంట రుణం తీసుకున్నాం. కానీ, ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదు. అన్ని అర్హతలు న్నా మాఫీ కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. రుణమాఫీ కాని వారందరూ బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రైతులందరికీ ప్రభుత్వం న్యా యం చేయాలి.
-కోట్ల యాదగిరి, ఏర్పుమళ్ల, బొంరాస్‌పేట మండలం
కేసీఆర్ హయాంలో రైతులందరి రుణాలను మాఫీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ మాటల్లోనే ఉన్నది.. చేతల్లో లేదు. నేను కొడంగల్ ఎస్బీఐలో రూ.1.40 లక్షలు, నా కొడుకు దయాకర్ రూ. 90 వేలు పంటల సాగుకు తీసుకున్నాం. రేషన్‌కార్డును ప్రాతిపదికగా తీసుకున్నా ఇద్దరిలో ఒకరికైనా మాఫీ కావాలి. కానీ, ఇద్దరికీ కాలేదు. ఇదేం రుణమాఫీయో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వరుసగా కష్టాలే ఎదురవుతున్నాయి. రుణమాణీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ జాబితాలు చూసిన తర్వాత నిరాశే ఎదురైంది.
-గోవింద్‌రెడ్డి, రేగడిమైలారం, బొంరాస్‌పేట
వ్యవసాయ పనుల నిమిత్తం బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నా. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తున్నదని తెలిసి చాలా సంతోషించా. కానీ రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టి వేలాది మందికి రుణమాఫీని దూరం చేయడం బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు, నిబంధనలు పెట్టి అన్నదాతలను ఆగం చేయొద్దు. ఇచ్చిన మాట ను నిలబెట్టుకోవాలి. అందుకు రైతులందరి పంట రుణాలను మాఫీ చేయాలి
– శ్యాంసుందర్, రైతు, కొడంగల్