Agriculture Equipments | యాచారం, డిసెంబర్ 11 : ఇన్నాళ్లు మూస పద్ధతిలో వ్యవసాయం చేసిన రైతులు ఇప్పుడు వినూత్న సాగుపై దృష్టి సారించారు. ఆధునిక యంత్రాలతో సేద్యం చేస్తూ కూలీల కొరతను అధిగమిస్తున్నారు. రైతులను వేధిస్తున్న కూలీల కొరత యంత్రాల వినియోగంతో తీరుతున్నది. గ్రామాల్లో పత్తి, జొన్న, కంది, వరి తదితర పంటలు సాగవుతున్నాయి. గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసినప్పటి నుంచి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో కూలీలు అందుబాటులో లేక యంత్రాల వైపు మొగ్గుచూపారు. తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తున్నారు.
పవర్ వీడర్ యంత్రాలు రెండు రకాలు. ఒకటి కలుపు తీయడానికి ఉపయోగిస్తే, ఇంకొకటి పొలం దున్నేందుకు ఉపయోగపడుతాయి. ట్రాక్టర్లు వెళ్లేందుకు వీలుగాని పొలాల వద్దకు సులువుగా తీసుకెళ్లొచ్చు. పైగా కరిగట్లలో బురదలోనూ సులభంగా దున్నవచ్చు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పత్తి, జొన్న పంట పొలాల్లో కలుపు తీసేందుకు పవర్ వీడర్‌ను ముమ్మరంగా వాడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ కలుపు తీయడంతో పాటు ఖర్చు సైతం తక్కువేనని రైతులు పేర్కొంటున్నారు. బురదలో దున్నే యంత్రం ధర సుమారు రూ.3లక్షల వరకు ఉంటుంది. మిగతావి యంత్రం రకాన్ని బట్టి ధరలు ఉంటాయి.
ట్రాక్టర్‌కు అనుసంధానంగా ఉండే యంత్రం కల్టివేటర్. ఈ యంత్రం పొలాల్లో దుక్కులు దున్నేందుకు ఉపయోగపడుతుంది. గతంలో ఎడ్ల నాగలితో రోజంతా దున్నిన పొలాన్ని కల్టివేటర్‌తో గంటలోనే దున్నేస్తున్నారు. దీంతో శ్రమ, సమయం ఆదా అవుతున్నది. దీని ధర రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఉంటుంది. వ్యవసాయ శాఖ సబ్సిడీపై అందజేస్తున్నది.
రోటవేటర్ రాకముందు ఈ యంత్రాన్ని అధికంగా వాడారు. భూమిలో గడ్డిని కలియదున్నేందుకు ఉపయోగించేవారు. కొన్ని ప్రాంతాల్లో ఈ డిస్క్ఆరో యంత్రాలను వాడుతున్నారు. దీని ధర సుమారు రూ. 35వేలు ఉంటుంది.
మక్కలు, జొన్న కంకులు పట్టేందుకు మేజ్‌సెల్లార్ యంత్రాన్ని ఉపయోగిస్తారు. మార్కెట్లోకి ఇటీవలే వచ్చింది. ఇంతకు ముందు కంకి పొట్టు తీసే యంత్రం అందుబాటులోకి ఉండగా, ఇది కంకి పొట్టు తీయకుండానే మక్కలను వేరు చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న యంత్రంతో 50క్వింటాళ్లను పట్టాలంటే నాలుగు గంటలకు పైగా సమయం పట్టేది. కానీ మేజ్‌సెల్లార్ యంత్రంతో గంటలోనే పట్టొచ్చు. ధర సుమారు రూ.3లక్షల వరకు ఉంటుంది.
ఇది గడ్డిని కట్టకట్టే యంత్రం. వరి పంటను కోసిన తరువాత ఎంతో మంది కట్టలు కట్టి కొట్టి గింజలను, గడ్డిని వేరు చేసేవారు. ఈ యంత్రం వచ్చిన తర్వాత సులభంగా గడ్డిని కట్టలుగా కట్టిస్తున్నారు. ఇలా కట్టలు కట్టిన గడ్డిని కొన్నేళ్ల పాటుగా పశువులకు నిల్వ చేసుకోవచ్చు. దీంతో గడ్డిని రవాణా చేయడం ఎంతో సులభంగా ఉంటుంది. దీని ధర సుమారు రూ.3లక్షల వరకు ఉంటుంది. యంత్రం సామర్థ్యాన్ని బట్టి ధర ఉంటుంది.
రోటవేటర్ యంత్రాన్ని ట్రాక్టర్‌కు బిగించి నడిపిస్తారు. ఇది వ్యవసాయంలో అన్ని పరికరాలకంటే అధికంగా ఉపయోగపడుతుంది. పంట పూర్తైన తర్వాత కొయ్యలు, గడ్డిని కాల్చడంతో భూసారం కోల్పోతుంది. దీనికి బదులుగా రోటవేటర్‌ను ఉపయోగిస్తే గడ్డిని, కొయ్యలను భూమిలో కలియదున్ని మెత్తగా చేస్తుంది. దీంతో నేల సారవంతమవడంతో పాటు మరో పంటను త్వరగా వేసుకునేందుకు వీలుంటుంది. రైతులు దీని వాడకాన్ని పెంచుతున్నారు. దీని ధర రూ.లక్షా 5వేలు ఉంటుంది. సబ్సిడీలో తక్కువగా ఉంటుంది.
ఈ యంత్రం మామూలుగా కల్టివేటర్ కంటే ఎక్కువ లోతుగా దున్నుతుంది. పొలాన్ని లోతుగా దున్ని మట్టిని కింద మీద చేస్తుంది. ఎంబీప్లౌ యంత్రం వేసవి దుక్కులు దున్నుకునేందుకు పని చేస్తుంది. ఎంబీప్లౌ యంత్రంతో దున్నడంతో పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది. ధర సుమారు రూ.25వేల వరకు ఉంటుంది.
ఈ యంత్రం ట్రాక్టర్‌కు అనుసంధానంగా పని చేస్తుంది. ఈ యంత్రంలో విత్తనాలు ఎరువులు పోసి ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి దుక్కిలో దున్నితే సరైన మోతాదులో విత్తనాలను, ఎరువులను ఒకే సారి వదులుతుంది. దీని వల్ల కూలీల ఖర్చు తగ్గడంతో పాటు సమయానికి విత్తనాలు, ఎరువులను చల్లుకోవచ్చు. ధర సుమారు రూ.48వేలు ఉంటుంది.
గతంలో కంటే వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందింది. యంత్రాలను ఉపయోగించడం వల్ల శ్రమతో పాటు సమయం ఆదా అవుతున్నది. యంత్రాల వల్ల పెట్టుబడి తగ్గడంతో పాటు కూలీల కొరత తీరుతున్నది. ముఖ్యంగా యువ రైతులు యంత్ర సాగుపై దృష్టి సారిస్తున్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయం విదేశాల్లో మాదిరిగా మన దగ్గర కూడా ప్రతి పనికి ఓ యంత్రం రావొచ్చు.
– సందీప్‌కుమార్, వ్యవసాయాధికారి, యాచారం