వానకాలానికి సంబంధించి వికారాబాద్ జిల్లాలో వరి సాగు భారీగా పెరిగింది. సమృద్ధిగా వర్షాలు కురువడం, చెరువులు, కుంటలు, బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో అన్నదాతలు వరి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా అంచనాలకు మించి వరి సాగైంది. జిల్లా వ్యవసాయాధికారులు చేపట్టిన పంట వివరాల నమోదు ప్రకారం జిల్లాలో లక్ష్యానికి మించి వరి పంట సాగైంది. ఈసారి వరి సాగు అంచనా విస్తీర్ణం 95 వేల ఎకరాలు కాగా.. ఇప్పటికే 1,29,131 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. వరి నాట్లు వేసేందుకు మరో వారం రోజులు అనుకూలం కాగా, వరి పంట విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నదని వ్యవసాయాధికారులు అంచనా బవేస్తున్నారు. అత్యధికంగా బొంరాస్‌పేట మండలంలో 20,450 ఎకరాల్లో రైతులు వరి పంటను వేశారు. వానకాలానికి సంబంధించి జిల్లావ్యాప్తంగా దాదాపు 30 లక్షల క్వింటాళ్ల మేర వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వికారాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఈ ఏడాది వరి సాగు భారీగా పెరిగింది. వానకాలం ప్రారంభం నుంచి జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో వరి సాగు అంచనాలకు మించి పెరగడం గమనార్హం. చెరువులు నిండడంతోపాటు బోరు బావుల్లో కూడా నీరు రావడంతో జిల్లా రైతాంగం వరి సాగువైపు మొగ్గు చూపారు. ప్రధానంగా జులై నెలలో కురిసిన భారీ వర్షాలతో అంచనాలకు మించి వరి పంట సాగైంది. మరో పది వేల ఎకరాల్లో నాట్లు వేసే అవకాశముందని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గతేడాది 1.35 లక్షల ఎకరాల్లో వరి పంటను జిల్లా రైతాంగం సాగు చేయగా, ఈ ఏడాది గతేడాదికి మించి వరి సాగయ్యే అవకాశముందని లెక్కలేస్తున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశముందని సంబంధిత అధికారులు అంచనా వేశారు.
రికార్డు స్థాయిలో వరిసాగు..
జిల్లా వ్యవసాయాధికారులు సేకరించిన పంటల వివరాల సేకరణ ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణానికి మించి వరి పంటను రైతులు సాగు చేశారు. ఈ ఏడాది వరి సాధారణ సాగు విస్తీర్ణం 95 వేల ఎకరాలుకాగా ఇప్పటివరకు 1,29,131 ఎకరాల మేర వరి పంటను రైతులు సాగు చేశారు. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 30వేల ఎకరాలకుపైగా వరినాట్లు పెరగగా, మరో పది వేల ఎకరాల వరకు సాగు పెరుగొచ్చని అంచనా వేస్తున్నారు. జిల్లాలో అధికంగా బొంరాసుపేట, కులకచర్ల, దోమ, దౌల్తాబాద్ మండలాల్లో వరి సాగు చేశారు. ఇప్పటివరకు 1,29,131 ఎకరాల్లో వరిపంట సాగుకాగా, అత్యధికంగా బొంరాసుపేట మండలంలో 20,450 ఎకరాలు, దోమ 16,308, కులకచర్ల 15,800, యాలాల 14,341, దౌల్తాబాద్ 13,807, పరిగి 8175, చౌడాపూర్ 8 వేలు, కొడంగల్ 7950, బషీరాబాద్ 5656, తాండూరు 5423, ధారూరు 5150, పెద్దేముల్ 5102, పూడూరు 1246, మోమిన్‌పేట 544, నవాబుపేట 260, వికారాబాద్ 651, కోట్‌పల్లి 130, బంట్వారం 102, మర్పల్లి మండలాల్లో 36 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు.
మరింత సాగు పెరుగవచ్చు..
వరిసాగుకు సంబంధించి మరో వారం రోజుల వరకు వరినాట్లు వేసుకోవచ్చు. ఈ ఏడాది అంచనాలకు మించి అధిక మొత్తంలో రికార్డు స్థాయిలో వరి పంటను రైతులు సాగు చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం బోర్లు, చెరువుల్లో నీరు నిండడంతో రైతులంతా వరి సాగుకే ఆసక్తి చూపారు. ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున వానకాలం సీజన్‌కుగాను సాగయ్యే వరి పంటతో దాదాపు 30 లక్షల క్వింటాళ్ల మేర వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా.
-గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి