పూడూరు, సెప్టెంబర్ 12 : తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పూడూరు మండలంలోని చన్గోముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. మహిళల ఆరోగ్యం కోసం రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్తగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో మహిళలకు వైద్యం అందుతున్నదన్నారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 43,320 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. మహిళలకు ప్రత్యేక వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనేక సంక్షేమ పథకాలతోపాటు మహిళా ఆరోగ్య పథకం అమలుతో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పూడూరు మండలం పరిధి చన్గోముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి పల్వాన్ కుమార్‌లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో 372 ప్రత్యేక మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో జూన్ 20న ఈ పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గతంలో దోమ, యాలాల, రామయ్యగూడ ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభించగా, నేడు కొత్తగా పూడూరు మండలం చన్గోముల్, బంట్వారం, మోమిన్‌పేట, ధారూరు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి మహిళకు ప్రత్యేక వైద్యం అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మహిళా ఆరోగ్య పథకాన్ని తీసుకువచ్చిందన్నారు.
ప్రతి మంగళవారం వైద్య పరీక్షలు
స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం ప్రత్యేక వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవిస్తే మగ శిశువుకు రూ.12వేలు, ఆడశిశువుకు రూ.13వేలు సర్కారు అందజేస్తున్నదన్నారు. తల్లీబిడ్డల సంరక్షణ కోసం ప్రభుత్వం రూ.2800 విలువ చేసే 16 రకాల కేసీఆర్ కిట్లను అందజేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 43,320 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేసినట్లు తెలిపారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన పలు గ్రామాల మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి
ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని.. అందుకే ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ మల్లిక, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి, పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజారుద్దీన్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రహీస్‌ఖాన్ ఉన్నారు.