బీఆర్ఎస్ టికెట్ ఇవ్వని నేతలను మాత్రమే నమ్ముకొని మనుగడ సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా కల్వకుర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు రాజుకున్నది. నియోజకవర్గంలో గత ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ఎన్నారై సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డికి టికెట్ ఖరారవుతుందనే ఆశతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. కానీ రాత్రికి రాత్రే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లోకి రావడంతో పార్టీలో చీలికలు మొదలయ్యాయి. పార్టీని నమ్ముకున్న వారిని కాదని, రాత్రికి రాత్రే కండువా మార్చిన వారి చేతిలో టికెట్ పెట్టే దుస్థితిని ఆ పార్టీ నేతలే ఎండగడుతున్నారు. సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి వర్గం నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
-సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ)/ఆమనగల్లు
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ)/ఆమనగల్లు : మహేశ్వరం.. మల్కాజిగిరి.. మెదక్.. తాజాగా కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వని నేతలను మాత్రమే నమ్ముకొని మనుగడ సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీని నమ్ముకున్న వారిని కాదని, రాత్రికి రాత్రి కండువా మార్చిన వారి చేతిలో టికెట్ పెట్టే దుర్ణీతిని ఆ పార్టీ నేతలే ఎండగడుతున్నారు. ఇందులో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గంలోనూ తాజాగా పార్టీ శ్రేణులు అధిష్ఠానానికి షాక్ ఇచ్చాయి. ప్యారాచూట్ నేతతో పని కానిద్దామనుకున్న అధిష్ఠానానికి పార్టీ శ్రేణులు అల్టిమేటం జారీ చేస్తున్నారు.
ఇంతకాలం పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని రాత్రికి రాత్రి కండువా మార్చిన వారికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి వర్గం నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఆమనగల్లులో నిర్వహించిన సమావేశంలోనూ ఇదేరీతిన నేతలు అధిష్ఠానానికి సంకేతాలు పంపారు. సర్వే రిపోర్టుల ఆధారంగా టికెట్లు కేటాయించాలేగానీ.. రాత్రికి రాత్రి పార్టీ మారిన వారికి టికెట్లు ఇవ్వాలనుకోవడం వెనక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ తమ పార్టీ నాయకుల్లో ఎవరు మెరుగో గుర్తించి..
వారికి పోటీ చేసే అవకాశం ఇస్తుంది. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీరు విచిత్రంగా తయారైంది. సొంత పార్టీ నేతలను కాదని.. అధికార బీఆర్ఎస్ ఎవరికి టికెట్ ఇవ్వలేదో గుర్తించి, వారికి పార్టీ కండువా కప్పి టికెట్ ఇచ్చేందుకు నానా తంటాలు పడుతుంది. ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గంలో కొంతకాలం కిందట పార్టీలోకి వచ్చిన నేతకు టికెట్ ఇస్తున్నారని, ఇందుకోసం ఐదెకరాల భూమి, రూ.10 కోట్లు చేతులు కూడా మారాయనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
అదేవిధంగా మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ రాత్రికి రాత్రి పార్టీ మారిన వారికి టికెట్ ఖరారైందంటూ చెబుతున్నారు. దీంతో అటు మేడ్చల్, ఇటు మెదక్ డీసీసీ అధ్యక్షులు సహా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామాలు చేశారు. ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గం వంతు వచ్చింది. ఇక్కడ కూడా బీఆర్ఎస్లో టికెట్ రాని నేతను పార్టీలో చేర్చుకొని టికెట్ చేతిలో పెట్టేందుకు రంగం సిద్ధమవుతుందనే సమాచారం కల్వకుర్తి కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
రేవంత్-వంశీ పోరుతో..
వాస్తవానికి ఎన్నారై సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలో గత ఏడాది, ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఢిల్లీకే పరిమితం కావడంతో సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్ కూడా ఆయన వెంట నిలిచి, పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగూ సుంకిరెడ్డికే ఈసారి టికెట్ ఖరారవుతుందనే ఆశతో పార్టీ శ్రేణులు ఉన్నారు.
కానీ రాత్రికి రాత్రి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లోకి రావడంతో ఇప్పుడు పరిస్థితి ‘ముందొచ్చిన చెవుల కంటే… వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్లుగా తయారైంది. ముఖ్యంగా ఎన్నారై రాఘవేందర్‌రెడ్డి వెనక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రోద్బలం ఉండగా… అందుకు వ్యతిరేకంగా వంశీచంద్‌రెడ్డి హుటాహుటిన కసిరెడ్డిని రంగంలోకి దింపారు. అంటే.. రేవంత్-వంశీ పోరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పని చేసిన వారి మెడకు చుట్టుకుంది.
సుంకిరెడ్డికి మద్దతుగా విస్తృతంగా సమావేశాలు
ఇన్నాళ్లూ కష్టపడిన తమను కాదని కసిరెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు గళం విప్పాయి. సుంకిరెడ్డి వర్గం నేతలు భారీ ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు. కల్వకుర్తి, వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండలాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించుకొని, ప్యారాచూట్ నేతకు టికెట్ ఇస్తే తాము కార్యాచరణ ప్రకటిస్తామని అధిష్ఠానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఆమనగల్లులోని శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఆమనగల్లు మండల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులకు ఇన్నాళ్లూ సుంకిరెడ్డి అండగా నిలిచారని, పార్టీ కోసం అహర్నిశలు పని చేశారని అన్నారు. కానీ ఇప్పుడు ఆతన్ని కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అధిష్ఠానం టికెట్ ఇస్తే ఊరుకునేదిలేదని పలువురు సీనియర్ నాయకులు హెచ్చరించారు. వివిధ గ్రామాలు, తండాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, ఎన్ఎస్యూఐ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి వచ్చారు.