ఇటీవల ఓ రైతు తన పేరు రికార్డుల్లో తప్పుగా నమోదు కావడంతో దానిని సరిచేసుకునేం దుకు టీఎం-33లో దరఖాస్తు చేసుకున్నాడు. అనంత రం ఓ మండల కార్యాలయానికెళ్లి మీరు రిపోర్టు ను పై అధికారులకు త్వరగా పంపిస్తే భూసమస్య పరిష్కారం అవుతుందని చెప్పాడు. అయితే మాకు ఎకరానికి రూ.20 వేలు ఇస్తేనే రిపోర్టును కలెక్టరేట్‌కు పంపిస్తామని ఆ మండల డిప్యూటీ తహసీల్దార్ తెగేసి చెప్పడం గమనార్హం.
ఓఆర్సీ(ఆక్యుఫైడ్ రైట్ సర్టిఫికెట్) కోసం ఓ రైతు ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత పంచనామాకు వచ్చిన ఆర్ఐ రూ.5 వేలు ఇస్తేనే రిపోర్టును రూపొందిస్తానని.. ఓఆర్సీ జారీకి ఆర్డీవోకు పంపే రిపోర్టును కూడా నేనే పంపించాల్సి ఉంటుందని.. అందుకు ఎకరానికి రూ.40 వేలు చెల్లించా ల్సిందేనని చెప్పడంతో బాధితుడు షాక్ అయ్యాడు.
వికారాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో సేవలను పారదర్శకంగా అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పోర్టల్‌ను కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పనికి.. ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. పోర్టల్ ఆపరేటర్, ఆర్ఐ నుంచి తహసీల్దార్ స్థాయి వరకు ఒక్కో స్థాయిలో వాళ్లు అడిగినంత ఇస్తేనే ఫైల్ ముందుకు కదులుతుంది.. లేదంటే ఏదో ఒక కొర్రీ పెట్టి పెండింగ్‌లో పడేస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భూబాధితుల నుంచి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించినా కొందరు తహసీల్దార్లు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయి తే దరఖాస్తుల పరిష్కారంలో మండల రెవెన్యూ యం త్రాంగం ఇచ్చే రిపోర్టులే కీలకం కావడంతో ఇదే అదునుగా చేసుకుని వారు అందిన కాడికి దోచుకుంటున్నారని పలు వురు మండిపడుతున్నారు. అక్రమార్కులతో కుమ్మక్కై అమాయకుల భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలూ బలంగా ఉన్నాయి.
పంచనామాకు రూ.5 వేలు..రిపోర్టుకు రూ.20 వేలు..
వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లోని రెవెన్యూ యంత్రాంగం వసూళ్లకు పాల్పడుతున్నది. దరఖాస్తుల పరిష్కారంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి వెళ్లే రిపోర్టులే కీలకం కావడంతో పైసలిస్తేనే రిపోర్టులు ఇస్తామని వారు తెగేసి చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తహసీల్దార్ నుంచి రిపోర్టును కలెక్టరేట్‌కు పంపించాలంటే క్షేత్రస్థాయిలో పంచనామా తప్పనిసరి. క్షేత్రస్థాయిలో పంచనామా చేయాలంటే రూ. ఐదు వేలు ఇవ్వాల్సిందేనని పలు మండలాల ఆర్ఐలు రేట్‌ను ఫిక్స్ చేశారనే ఆరోపణలున్నాయి. పంచనామా రిపోర్టు కలెక్టర్‌కు చేరాలంటే దానికి కూడా అదనంగా కొంత మొత్తా న్ని చెల్లిస్తేనే ఆ ఫైల్ ముందుకు కదులుతుంది.
అయితే తప్పుగా ఎంట్రీ అయి కష్టాలు పడుతున్న పేద రైతులనూ రెవెన్యూ అధికారులు వదలి పెట్టడం లేదు. ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో దరఖాస్తుల పరిష్కారం వెంటనే అవుతున్నా తహసీల్దార్ కార్యాలయాల్లో మాత్రమే కావాలనే పెండింగ్‌లో పెడుతున్నారు. అయితే కలెక్టర్‌కు పంపించే రిపోర్టుకు ఎకరాకు రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఫైల్ కనపడని పరిస్థితి పలు మండలాల్లో నెలకొన్నది. ఇటీవల ఓ తహసీల్దార్ అన్ని వివరాలు సరిగ్గానే ఉన్నా నెగెటివ్ రిపోర్టును పై అధికారులకు పంపించగా.. పరిశీలించిన అదనపు కలెక్టర్ తిరిగి మళ్లీ రిపోర్టును పంపించాలని ఆ ఫైల్‌ను వెనక్కి పంపారు. ఈ విధంగా పైసలిస్తేనే పాజిటివ్ రిపోర్టులు ఇస్తూ.. లేదంటే ఏదో ఒక కొర్రీ పెడు తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. అయితే మం డల రెవెన్యూ యంత్రాంగంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంతోనే అధికారులు, సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ ప్రతీక్ జైన్ దృష్టి సారించి పేద రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.