రంగారెడ్డి, మే 8 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మాడ్గుల మండలంలో రోజురోజుకూ చెరువులు, గుట్టలు మాయమవుతున్నాయి. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన అనేక చెరువులు నామరూపాల్లేకుండా పోతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. కబ్జాలకు గురవుతున్న చెరువులను కాపాడాలని ప్రజలు కోరుతున్నా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గిరికొత్తపల్లి గ్రామంలోని రంగసముద్రం, తుమ్మలకుంట చెరువులు కబ్జాకు గురికావటంతో గ్రామస్తులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు చెరువుల్లోని శిఖం భూములను కొందరు కొనుగోలు చేసి తూములు, కట్టలను ధ్వంసం చేసి నామరూపాల్లేకుండా చేస్తుండటం తో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్పందించిన రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పినా ఫలితంలేదు. కాగా, అధికారులకు ఫిర్యాదు చేసిన వారిపై అక్రమార్కులు దాడిచేయటంతో కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే, ఈ మండలంలోని అప్పారెడ్డిపల్లిలో ఉన్న కొత్తచెరువును కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కొత్త చెరువులోని శిఖం భూములను కొందరు కొని చెరువు అలుగు, తూము ధ్వంసం చేశారని వెంటనే కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఓవైపు అక్రమార్కులు చెరువులను చెరబడుతుండగా.. మరోవైపు మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. చెరువుల నుంచి యథేచ్ఛ గా మట్టిని తవ్వి విక్రయిస్తున్నారు. అనుమతులు లేకుండానే మట్టి తరలింపు జోరుగా సాగుతున్నదని..నిందితులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, ఎస్ఐలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మాడ్గుల మండలంలో జరుగుతున్న అక్రమ మట్టి, ఇసుక తరలింపుపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని పలు ప్రజాసంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.
మండలంలోని ఇర్విన్ గ్రామంలో కొత్తచెరువును 1972లో ఏర్పాటు చేశారు. ఈ చెరు వు నిర్మాణంతో నీట మునిగి భూములు కోల్పోయిన వారికి అప్పట్లోనే ప్రభుత్వం పరిహారం కూడా అందజేసింది. కాగా, ఇటీవల ఈ చెరువులో డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మరోమారు నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కా గా, కొంతమంది చెరువులోని శిఖం భూ ములను కొని నకిలీ పత్రాలు సృష్టించి పట్టాదారు పాసుపుస్తకాలు పొందారని.. వాటి ఆధారంగా మరోమారు పరిహారాన్ని కొట్టేసే యత్నం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మెల్యే దృష్టికి కూడా వారు తీసుకెళ్లారు. కాని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనం వీడడంలేదన్న ఆరోపణలున్నాయి. కాగా, అక్రమార్కులు ఇర్విన్ చెరువు నుంచి ట్రాక్టర్ల ద్వారా మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.