మొయినాబాద్, ఆగస్టు 18 : నగరానికి తాగునీరు అందించే గండిపేట జలాశయం ఎఫ్టీఎల్లో అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం రూపొందించిన హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నది. నిర్మాణాలు చేపడుతున్న వారు ఏ స్థాయి అని చూడకుండా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారా లేదా ? అని చూసి బహుళ సంతస్తులను సైతం కూల్చివేశారు.
భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేయగా, ఓ భవన నిర్మాణ యజమాని ఎంత వేడుకున్నా అధికారులు ఒప్పుకోలేదు. గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ చిలుకూరు, అప్పోజిగూడ గ్రామ పంచాయతీ రెవెన్యూను ఆనుకుని ఉంటుంది. ఓ రియల్ వ్యాపారి గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ను కలుపుకొని వెస్ట్ సైడ్ అనే వెంచర్‌ను చేయగా, కొందరు బడా బాబులు ఎఫ్టీఎల్ పరిధిలో ప్లాట్లు కొనుగోలు చేసి దర్జాగా లేక్ వ్యూవ్తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్సియల్ జిల్లా భవన అంతస్తుల వ్యూ కనిపించేలా అక్రమ నిర్మాణాలు చేపట్టారు.
హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సప్లయ్ డిపార్ట్మెంట్, సివరేజ్ బోర్డు అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులు గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ని నిర్మాణాలు చేపట్టారని సర్వే చేయగా అప్పోజిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మూడు భవనాలు, చిలుకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఒక భవనాన్ని నిర్మించినట్లుగా గుర్తించారు. ఆ రెండు శాఖల అధికారులు పూర్తి స్థాయిలో నివేదికను హైడ్రాకు నివేదించగా హైడ్రా ఆదివారం ఉదయం కూల్చివేసింది.
హైడ్రా అధికారులు మల్లికార్జున్, చరణ్‌తో పాటు హెచ్ఎంఎస్ఎస్బీ డీజీఎం నరహరి, జలమండలి విజిలెన్స్ అధికారి లక్ష్మీరెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి స్థానిక సీఐ పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలోని భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అప్పోజిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు భవనాలను, చిలుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక నిర్మాణాన్ని కూల్చివేశారు.
దేవలం వెంకటాపూర్ గ్రామ సమీపంలోని గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలోనూ ఓ అక్రమ నిర్మాణాన్ని కూడా కూల్చి వేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మంచిదేనని స్థానికులు పేర్కొంటున్నారు.
అడ్డుకునే ప్రయత్నం..
కోట్ల రూపాయలు పెట్టి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండగా యజమానులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా, అధికారులు మాత్రం లెక్క చేయలేదు. అప్పోజిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మూడు భవనాలను సుమారుగా 5 వందల గజాల విస్తీర్ణంలో నిర్మించారు. ఒక భవనం పనులు చివరి దశలోకి రాగా, కిటికీలు, డోర్లు, గ్లాస్ పిట్టింగ్లు అవుతున్నాయి. మరో రెండు భవనాలు భారీగా నిర్మించారు. ఆ రెండు భవనాల రెండో అంతస్తులో స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించుకున్నారు. నిర్మాణ దశలో ఉపయోగించిన మెటీరియల్ కాంట్రాక్టర్‌కు సంబంధించినది కాబట్టి వాటిని ఖాళీ చేయించి కూల్చివేశారు.
హైడ్రా చర్యలను ఆహ్వానిస్తున్నాం
రంగారెడ్డి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ భూముల్లో చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా చర్యలను సీపీఎం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆహ్వానిస్తున్నదని సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆదిబట్ల, శంషాబాద్, తుక్కుగూడ, మొయినాబాద్, శంకర్పల్లి ప్రాంతాల్లో నిర్మాణ కంపెనీలు చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టడాలను చేపట్టారు. వాటిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
హైడ్రా చర్యల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడుతున్న రాజకీయ నాయకులను ప్రభుత్వం ఉపేక్షించరాదని కోరారు. ప్రభుత్వం హైడ్రాకు అండగా నిలబడాలని, కబ్జాకు గురైన చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల వివరాలను ఆయా ప్రాంత ప్రజలు హైడ్రాకు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇప్పటికే సీపీఎం పార్టీ కొన్ని వివరాలను అందజేసిందని, మరిన్ని వివరాలను సేకరించి అందజేయనున్నట్లు తెలిపారు.