జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. ఎలాంటి అనుమతుల్లేకుండా రాత్రి అయిందటే చాలు వందలాది లారీలు, టిప్పర్లు రోడ్లపైకి వచ్చి హైదరాబాద్‌తోపాటు నగర శివారులోని పలు ప్రాంతాలకు యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నది. జిల్లా మైన్స్ కార్యాలయం నుంచి ముగ్గురికి మాత్రమే మట్టి తరలింపునకు అనుమతులుండగా.. జిల్లాలో వందలాది మంది ప్రభుత్వ భూములు, గుట్టలు, అసైన్డ్ భూములను జేసీబీలు, హిటాచీల సహాయంతో తవ్వుతూ మట్టి వ్యా పారం చేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గం డి కొడుతున్నారు. ఈ దందా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రా జేంద్రనగర్ నియోజకవర్గాల్లోని అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, ఆదిబ ట్ల, తుర్కయాంజాల్, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్, కందుకూరు, ఆమనగల్లు, షాద్‌నగర్, కొత్తూరు, యాచారం, మంచాల తదితర ప్రాంతాల్లో జోరుగా సాగుతున్నది. ఇంత జరుగుతున్నా అటు మైనింగ్ అధికారులు ఇటు రెవె న్యూ, పోలీస్ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరుకా యలుగా సాగుతున్నది. మైనింగ్ మాఫియా ఇచ్చే మమ్మూళ్ల మత్తు లో వారు జోగుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా ప్రతిరోజూ మట్టి అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వానికి రూ. కోటి నుంచి రూ. కోటీ యాభై లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్లు సమాచారం. ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
జిల్లా నుంచి నగరంతోపాటు పలు ప్రాంతాలకు ప్రతిరోజూ 300-400 ట్రిప్పుల వరకు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కొక్క ట్రిప్పునకు రూ. 4000- రూ. 5000 వరకు తీసుకుంటున్నారు. చిన్న టిప్పర్‌కు రూ. 4000 పెద్ద ట్రిప్పర్‌కు రూ. 5000 వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతిరోజూ మట్టి అక్రమంగా తరలింపుతో రూ. కోటి నుంచి రూ. కోటీ యాభైలక్షల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నది. అక్రమార్కులు ప్రభుత్వ భూము లు, గుట్టల నుంచే అక్రమంగా మట్టి దందాను నిర్వహిస్తున్నారు. ఈ మట్టిని ఎక్కువగా శివారులోని గృహ నిర్మాణాలు, భూముల చదును, వెంచర్లలో రోడ్లు వేసేందుకు పలువురు వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో మట్టిని తరలించేందుకు ముగ్గురు మాత్రమే అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. మహేశ్వరం మండలంలోని రావిర్యాల, కేశంపేట మండలంలో ఒక్కొక్కరు చొప్పు న ఇద్దరు.. హయత్‌నగర్ మండలంలోని కొహెడలో మరొకరు ఉన్నా రు. అనుమతులు తీసుకున్న వారు రోడ్లు ఇతరత్రా పనుల కోసం మట్టిని తీసుకెళ్తున్నారు. ఈ మట్టిని కూడా పట్టాభూముల నుంచే తరలిస్తున్నారు. ఇందుకు క్యూబిక్ మీటర్‌కు రూ. 41 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. కానీ, జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది మంది మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.
వ్యాపారులు మట్టిని అక్రమంగా తరలిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి రూ. కోట్లలో నష్టం వాటిల్లుతున్నది. ప్రభుత్వ, అసైన్డ్ భూములు, గుట్టలను జేసీబీ లు, హిటాచీలతో తొలిచి మట్టిని వందలాది లారీలు, ట్రక్కుల ద్వారా యథేచ్ఛగా నగరంతోపాటు పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంచాల మండలంలోని ఆగాపల్లిలో మట్టి అక్రమ రవాణా గత నెల రోజులుగా రాత్రి పూట జరుగుతున్నదని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ, ఇబ్రహీంపట్నం సమీపంలోని తట్టిఖానా వద్ద నుంచి కూడా గత నెల రోజులుగా రాత్రిపూట మట్టి దందా సాగుతున్నదని పలువురు పేర్కొంటున్నారు. ఉప్పరిగూడలో ఓ మట్టి వ్యాపారి తాను ఎమ్మెల్యే బంధువునని చెప్పుకొని ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నాడు. ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ భూమి నుంచి గత నెలరోజులుగా మట్టిని తవ్వి ఇబ్రహీంపట్నంతోపాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
జిల్లాలో మట్టిని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ, పోలీసు అధికారుల సహాయంతో విస్తృ తంగా దాడులు నిర్వహిస్తాం. మట్టిని తరలించే వారు సంబంధిత భూముల నిర్వాహకుల నుంచి అనుమతి పత్రాలు తీసుకొస్తే ప్రభుత్వం తరఫున అనుమతులిస్తాం. అనుమతుల్లేకుండా మట్టిని తరలిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు సంబంధిత యంత్రాలను సీజ్ చేస్తాం.