వికారాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లా మైనింగ్ శాఖ అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని తెలిసినా పర్మిషన్స్ ఇస్తూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో లీజు ముగిసినా, లీజు జారీ చేసిన ప్రాంతంతోపాటు పక్క భూమిలోనూ మైనింగ్ నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. మూమూళ్ల మత్తు లో జోగుతూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుతున్నారనే ఆరోపణలున్నాయి.
జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ జోరుగా జరుగుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తమకు సంబంధం లేదంటూ మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాండూరులో ఏండ్ల కిందట లీజు పొంది, దాని గడువు ముగిసినా ఆ ప్రాంతంలో అక్ర మంగా తవ్వకాలు జరుపుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని.. అంతేకాకుండా అనుమతులు ఒకచోట తీసుకుని.. తవ్వకాలు మరోచోట చేస్తున్నట్టు స్థానికులు మండిపడుతున్నారు. మైనిం గ్ దందాకు అనుమతులివ్వడం తప్ప.. అక్రమమా.. సక్రమమా అన్న దానిపై కనీసం విచారణ చేయడంలేదని పేర్కొంటున్నారు.
అక్రమ సుద్ద గను లు, ఎర్రమట్టి, కంకర దందాలు నడిపించే వారు ఓవర్ లోడ్‌తో వాహనాలను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. గతేడాది మీర్జాగూడ వద్ద కంకర ఓవర్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం విదితమే. ఈ రోడ్డు ప్రమాదం అనంతరం వారం, పది రోజులు తనిఖీల పేరిట హల్చల్ చేసిన రవాణా శాఖ అధికారులు త ర్వాత చేతులెత్తేయడంతో నిత్యం జిల్లా కేంద్రం మీదుగా, మన్నెగూడ, తాండూరు తదితర ప్రాంతాల్లో ఓవర్ లోడ్‌తో కంకర, ఎర్రమట్టి, బండరాళ్లను తరలిస్తున్నా పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.
జిల్లాలోని.. దుద్యాల మండలంలోని గౌరారం రిజర్వ్ ఫారెస్ట్‌లో రెవెన్యూ, అటవీ శాఖల అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ గనుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గౌరారంలోని రెండు వేల ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రతిపాదించారు. అయితే అటవీశాఖ అధికారులు ఆ భూములను కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెవెన్యూ అధికారులు రైతులకు పట్టాలిస్తూ పోవడంతో.. గౌరారం ఫారెస్ట్ ప్రస్తుతం 180 ఎకరాలకు కుంచించుకుపోయింది.
ప్రస్తుతమున్నవి పట్టా భూములంటూ మైనింగ్ నిర్వాహకులు కోర్టుకెళ్లడం, పట్టా భూమి కానే కాదని అటవీ శాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కాగా, వాటికి సంబంధించిన ఫైళ్లను కుణ్ణంగా పరిశీలించగా అసలు విషయం బయటపడి.. గౌరారం రిజర్వ్ ఫారెస్ట్‌లో జరుగుతున్న అక్రమ గనుల తవ్వకాలను అధికారులు నిలిపేశారు. మైనింగ్ లీజు గడువు ముగియడంతో రెన్యువల్‌కు మైనింగ్ నిర్వాహకులు దరఖాస్తు చేసుకోగా.. అక్కడ జరుగుతున్నది అక్రమ మైనింగ్ అని పలువురు అధికారులు సమాచారమిచ్చినా గనుల శాఖ అధికారులు పట్టించుకోకుండా లీజును రెన్యువల్ చేశారు.
అటవీ భూములని తెలిసి కూడా లీజును రెన్యువల్ చేయడంపై జిల్లా అటవీ శాఖ అధికారులు మైనింగ్ అధికారులకు రెండు నెలల కిందట నోటీసులిచ్చారు. కోర్టు స్టే ఉన్న సమయంలో మైనింగ్‌కు రెన్యువల్ చేయడంపై జిల్లా మైనింగ్ అధికారులపై విమర్శలు వినిపిస్తున్నాయి. లీజు రెన్యువల్ కోసం రూ.లక్షల్లో మైనింగ్ అధికారులు అందినట్టు ఆరోపణలున్నాయి.
జిల్లాలో అక్రమ ఇసుక, ఎర్రమట్టి దందాను రెవెన్యూ, పోలీస్ శాఖలకు చెందిన కొందరు అధికారులు దగ్గరుండి నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. ఒక్కో ఇసుక ట్రాక్టర్‌కు, ఒక్కో ఎర్రమట్టి లారీకి ఇంత చెల్లించాలని ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో ఎలాంటి అనుమతుల్లేకుండానే ఎర్రమట్టిని తరలిస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
వికారాబాద్ నియోజకవర్గంలోని ఓ మండలం లో పనిచేసే ఓ రెవెన్యూ ఉద్యోగి ఉదయం తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తించి.. రాత్రివేళల్లో అక్రమ ఎర్రమట్టి తరలింపు జరిగే ప్రాంతంలో ఉంటూ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారనే ప్రచారమూ ఉన్నది. ఇదంతా సదరు తహసీల్దార్‌కు తెలిసినా ఆయనకూ ఈ వసూళ్లలో కొంత అందుతుండడంతో పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. మరోవైపు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ తహసీల్దార్ ఎర్రమట్టి తవ్వకాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారమివ్వగా, మీరు అనుమతులిస్తారు.. దాడులు చేసి సీజ్ చేయాలా అంటూ టాస్క్‌ఫోర్స్ అధికారి తహసీల్దార్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రభుత్వ భూములు, అటవీ భూముల్లో ఎర్రమట్టి తవ్వకాలకు ఎలా అనుమతిస్తారంటూ ప్రశ్నించడంతో ఏం మాట్లాడలేక ఫోన్ పెట్టేసినట్టు సమాచారం.