వికారాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి హిల్స్‌కు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుండడంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా అనంతగిరి చుట్టుపక్కల పదుల సంఖ్యలో ప్రైవేట్ రిసార్టులు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం పేద రైతులకిచ్చిన అసైన్డ్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపట్టి రిసార్టులు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. నైట్ క్యాంపింగ్, గేమింగ్ క్లబ్, అడ్వెంచర్ ట్రిప్, బోటింగ్ పేరిట రిసార్టులను నిర్వహిస్తున్నారు. ఎలాటి సేఫ్టీ నిబంధనలు పాటించకుండానే బోటింగ్, అడ్వెంచర్ గేమ్స్ నిర్వహిస్తూ పర్యాటకుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. పర్యాటకుల నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్న రిసార్టుల నిర్వాహకులు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణనష్టం జరగకుండా సమకూర్చే సేఫ్టీ జాకెట్స్, ట్యూబ్స్, గజ ఈతగాళ్లు లేకుండానే పర్యాటకుల నుంచి దోపిడీయే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం సేఫ్టీ జాకెట్స్, ట్యూబ్స్ లేకుండానే సర్పన్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్‌కు తీసుకెళ్లిన వైల్డర్నెస్ రిసార్ట్ నిర్వాహకులు ఇద్దరు మహిళల ప్రాణాలను బలితీసుకున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ వికారాబాద్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధిత రిసార్ట్ యాజమాన్యం మాత్రం మీడియాతోపాటు చుట్టుపక్కల గ్రామాలవారిని రిసార్ట్‌లోకి రానివ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నది. గతంలో కూడా సర్పన్‌పల్లి ప్రాజెక్టు సమీపంలో వెలసిన పలు రిసార్టులలో బైక్ రేసింగ్ చేస్తూ ఓ పర్యాటకుడు చనిపోగా, గేమ్‌లో భాగంగా ఈత రాకుండానే బావిలో దూకడంతో మరో పర్యాటకుడు మృతిచెందిన ఘటనలున్నాయి.
వికారాబాద్ సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టుకు ఆనుకొని ఉన్న అసైన్డ్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రైవేట్ రిసార్టులు వెలిశాయి. చెరువులను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు నిర్మించారు. గుడినే కాదు.. గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగిండ్రు అనే చందంగా తయారైంది పలు చెరువుల పరిస్థితి. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌ను కబ్జా చేశారని వింటుంటాం. కానీ సర్పన్‌పల్లి ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన వైల్డర్నెస్ రిసార్ట్ నిర్వాహకులు ఏకంగా చెరువులనే కబ్జా చేసి అక్రమంగా దోచుకుంటున్నారు. ఒకప్పుడు వ్యవసాయానికి సాగు నీరందించిన సర్పన్‌పల్లి ప్రాజెక్టు ఇప్పుడు అక్రమ వ్యాపారుల దోపిడీకి కల్పతరువైంది. సాగుకు చుక్క నీరు కూడా వదలలేని పరిస్థితినెలకొనడంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు సమీపంలోకి పోవాలంటేనే జంకుతున్నారు.
సర్పన్‌పల్లి చెరువు చుట్టుపక్కల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ కబ్జా జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధికి రాదంటూ ఆక్రమణదారులకు అధికారులు వత్తాసు పలుకుతుండడం గమనార్హం. మరోవైపు గత కొన్నేండ్లుగా చెరువుల ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువులను ఆక్రమించిన ప్రాంతాల్లో రిసార్టులతోపాటు ఫాంహౌస్‌లు, ఇండ్ల నిర్మాణాలకు పంచాయతీ, ఆయా మున్సిపాలిటీల అధికారులుఅధికారులు అనుమతులు ఇస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సర్పన్‌పల్లి చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో రిసార్టులను అక్రమంగా నిర్మించారు. వైల్డర్నెస్ రిసార్ట్ నిర్వాహకులైతే ఏకంగా చెరువులోనే రిసార్ట్ కార్యకలాపాలను చేపడుతున్నారు. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో ఎలాంటి అనుమతులు లేకుండానే బోటింగ్ నిర్వహిస్తుండటంతోపాటు ప్రాజెక్టు మధ్యలో ప్రత్యేకంగా రూములను ఏర్పాటు చేశారు. నిబంధనలను పట్టించుకోకుండా, సేఫ్టీ చర్యలు పాటించకుండానే బోటింగ్ నిర్వహణతోపాటు చెరువు మధ్యలో రూములను ఏర్పాటు చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఏడాది క్రితం ఎలాంటి అనుమతులు లేవంటూ వైల్డర్నెస్ రిసార్ట్‌తోపాటు పలు రిసార్టులను మూసివేసిన అధికారులు, ముడుపులు అందిన వెంటనే వారే దగ్గరుండి తెరిపించారని ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా చెరువులోనే ప్రత్యేకంగా నాలుగు రూములను ఏర్పాటు చేసి అక్రమంగా వ్యాపారం చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువులో ఏర్పాటు చేసిన ఒక రూమును ఏడాది క్రితం సీజ్ చేసి ఇరిగేషన్ అధికారులు చేతులు దులుపుకొన్నారు. తదనంతరం అటువైపు చూడకపోవడం గమనార్హం. ఇరిగేషన్ అధికారులు సీజ్ చేసిన రూముతోపాటు ప్రాజెక్టు మధ్యలో ఉన్న రూములను గతేడాదిగా నిర్వహిస్తున్నారు. ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసే నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న వైల్డర్నెస్ రిసార్ట్‌పై జిల్లా యంత్రాంగం చర్యలకు సిద్ధమైంది. బోటు బోల్తా ఘటనపై సీరియస్ అయిన కలెక్టర్ తగిన చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. ఈమేరకు సోమవారం జిల్లా పంచాయతీ అధికారులు ఆ రిసార్ట్‌కు నోటీసులు ఇచ్చారు. అనుమతుల్లేకుండా ఎలా నిర్వహిస్తున్నారని అందులో ప్రశ్నించారు. ఆ రిసార్ట్‌కు ఏ ఒక్క దానికి కూడా అనుమతి లేదని గుర్తించి మొదట నోటీసులు జారీ చేసిన అధికారులు రెండు, మూడు రోజుల్లో సీజ్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ప్రైవేట్ రిసార్టులను నిర్వహించాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. రిసార్ట్ లేదా గేమింగ్ హబ్, క్యాంప్‌సైట్, అడ్వెంచర్ ట్రిప్ తదితరాలను నిర్వహించాలంటే ముందుగా రెవెన్యూ శాఖ నుంచి నాలా(వ్యవసాయేతర భూమి) ధ్రువీకరణ పత్రాన్ని., ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో నిర్వహించాలంటే ఎన్వోసీ తీసుకోవాలి. అడ్వెంచర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ నుంచి., క్యాంప్ ఫైర్ ఏర్పాటుకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తప్పనిసరి తీసుకోవాలని గతంలోనే జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. చెరువుల్లో బోటింగ్ తదితరాలను నిర్వహించాలంటే నీటిపారుదల శాఖ నుంచి అనుమతులు, రిసార్ట్ ఏర్పాటు చేసే భూమికి అటవీ శాఖ భూములకు సంబంధంలేదని అటవీ శాఖ నుంచి ఎన్వోసీ., కార్మిక శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని., గ్రామపంచాయతీ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలి. రిసార్ట్‌లలో 300 గజాలలోపు భవన నిర్మాణాలకు గ్రామపంచాయతీల నుంచి., 300 గజాల పైబడిన భవన నిర్మాణాలకు డీటీసీపీ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాల్సి ఉంది. పర్మినెంట్ రెస్టారెంట్ భవన నిర్మాణాలకు డీటీసీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ అనుమతులన్నీ పొందిన అనంతరం ఫుడ్, మద్యం విక్రయాలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతోపాటు ఎక్సైజ్ అధికారులు అనుమతులు పొందాల్సి ఉంది. కానీ వైల్డర్నెస్ రిసార్ట్‌తోపాటు చుట్టుపక్కల వెలసిన ఏ ఒక్క రిసార్ట్కూ ఒక్కటంటే ఒక్క అనుమతి లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ సంబంధిత అధికారులకు ముడుపులు అందజేసి రిసార్టులను దర్జాగా నిర్వహిస్తున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.