ఇబ్రహీంపట్నం : రైతులకు ఎళ్లవేలలా అండగా ఉంటూ ఎప్పటికప్పుడు సరైన రుణాలు అందజేస్తూ దేశంలోనే ఉప్పరిగూడ సహకారసంఘం అగ్రభాగాన నిలువడం అభినందనీయమని అఖిలభారత సహకారభారతి అధ్యక్షుడు బీనత్ టగోర్ అన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సహకారభారతి 7వ జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉప్పరిగూడ సహకారసంఘం ఎంపికైన తరుణంలో ఉప్పరిగూడ బ్యాంకును సందర్శించేందుకు త్వరలో రానున్నట్లు తెలిపిన ఆయన శుక్రవారం రాత్రి బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఆరు సహకార సంఘాల సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ సంఘం ఎంపిక కావడం సంతోషకరమన్నారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న సహకార సంఘాల్లో ఉప్పరిగూడ సంఘం నిలువడం వెనుక పాలకవర్గం, అధికారుల కృషి మరువలేనిదన్నారు.
ఉప్పరిగూడ సహకార సంఘాన్ని ప్రతి ఒక్క సంఘం అధ్యక్షుడు, సభ్యులు, అధికారులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు సందర్శనకు వచ్చిన బీనత్ టగోర్కు శాలువా పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా సహకారసంఘం అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సత్తయ్య, ఉప్పరిగూడ సహకారసంఘం చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, సీఈఓ గణేష్‌తో పాటు డైరెక్టర్లు, ఆయా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.