ఇబ్రహీంపట్నం : ఆదిబట్ల పోలీసుస్టేషన్ పరిధిలోని నాదర్గుల్లో గుట్టుచప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్న వ్యక్తులపై ఆదిబట్ల, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పదిమంది పందెంరాయుళ్లతో పాటు పదికోళ్లను, సుమారు రూ. 50వేల నగదును స్వాదీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఆదిబట్ల సీఐ నరేందర్ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భవన నిర్మాణ మేస్త్రీలు నగరశివారులలోని నాదర్గుల్, బడంగ్పేట్ గ్రామాల సరిహద్దులో గుట్టుచప్పుడు కాకుండా కోళ్లపందాలను నిర్వహిస్తున్నారు.
పక్కా సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఆదిబట్ల పోలీసుల సహకారంతో ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడులల్లో కోళ్ల పందాల నిర్వాహకులతో పాటు పందెంలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా పలువురి సెల్ఫోన్లతో పాటు సుమారు 6ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్న ఆదిబట్ల సీఐ తెలిపారు.