Hyderabad | ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 4 : ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేసినా ట్రాఫిక్ ఇబ్బందులు, అక్రమ పార్కింగ్‌ల సమస్యలు తప్పడంలేదని దుకాణదారులు, వ్యాపారస్తులు, ప్రయాణికులు అంటున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో గతంలో ట్రాఫిక్ పోలీసుస్టేషన్ లేక అక్రమ పార్కింగ్‌లతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇబ్రహీంపట్నంలో నాటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయించారు. కానీ, నేడు ట్రాఫిక్ పోలీసులున్నా లేనట్టుగానే కనిపిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యతో పాటు అక్రమ పార్కింగ్‌ల సమస్యలను పూర్తిగా నిర్మూలించాల్సి ఉన్నప్పటికీ ట్రాఫిక్ అధికారులు ఉదయం గంటసేపు, సాయంత్రం గంటసేపు తూతూమంత్రంగా విధులు నిర్వర్తించి చేతులు దులుపుకుంటున్నారని, మార్కెట్ సమయంలో అక్రమ పార్కింగ్‌లతో సమస్య తీవ్రమవుతోందని ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించకుండా తమ విధులను సక్రమంగా నిర్వర్తించి అక్రమంగా పార్కింగ్లు చేసే వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
Guru Naidu
అక్రమంగా రోడ్లపై పార్కింగ్చేసే వాహనాలకు ఫైన్లు వేస్తున్నాం : గురునాయుడు, ట్రాఫిక్ సీఐ ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం సాగర్రహదారితో పాటు తహసీల్దార్ కార్యాలయంరోడ్డు, మంచాల రోడ్డుతో పాటు ఇతర ప్రధాన రోడ్లల్లో అక్రమంగా పార్కింగ్లు చేయటంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ముఖ్యంగా రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు పార్కుచేసే వాహనాలకు ఎప్పటికప్పుడు ఫైన్ వేస్తున్నాం. అక్రమ పార్కింగ్‌లతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం.