ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 25 : నగరశివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాపై హైడ్రా దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణల పేరిట హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున పేదల ఇండ్లను కూల్చివేయడంతో పాటు అనేక మందిని నిరాశ్రయులను చేసింది. హైదరాబాద్ అనంతరం రంగారెడ్డి జిల్లాను టార్గెట్‌గా ఎంచుకున్నది. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులతో జిల్లాలోని చెరువులెన్ని, ఆక్రమణలకు గురైన చెరువులు ఎన్నీ.. అనేదానిపై నివేదిక తెప్పించుకున్నది. ఆక్రమణలకు గురైన వాటిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అతిపెద్దదైన ఇబ్రహీంపట్నం చెరువుతోతో పాటు తుర్కయాంజాల్ మాసాబ్ చెరువునూ అధికారులు పరిశీలించి ఆక్రమణలను గుర్తించారు. ఎప్పుడు హైడ్రా అధికారులు జిల్లాలో అడుగుపెడతారోనన్న భయాందోళనలో జిల్లా ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు చెందిన జనం సొంత ఇండ్లను కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. ఈ నియోజకవర్గాల్లోని చెరువుల పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు గతంలో ప్లాట్లు చేసి విక్రయించగా, పేదలు కొనుగోలు చేసి ఇండ్లను నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ ఇండ్లను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో 556 చెరువులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా చిన్న, పెద్ద చెరువులన్నీ కలిపి 701 ఉన్నాయి. అందులో 556 మాత్రమే పెద్ద చెరువులు ఉన్నాయి. 224 చెరువులు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇందులో పెద్దదైన ఇబ్రహీంపట్నం పెద్దచెరువుతో పాటు తుర్కయాంజాల్ మాసాబ్చెరువు, మహేశ్వరం నియోజకవర్గంలోని రావిరాల చెరువులతో పాటు బాలాపూర్, బడంగ్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, నాదర్గుల్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, హయత్‌నగర్, శంషాబాద్, తదితర ప్రాంతాల్లో చెరువులు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైనట్లు తెలిసింది. ఈ నెలాఖరు వరకు ఆక్రమణలకు గురైన చెరువులు హైడ్రా అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. గతంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చెరువులకు ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లను ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన ఎఫ్టీఎల్ లోపల బఫర్‌జోన్ లోపల చేపట్టిన నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
చెరువులు, కుంటల ఆక్రమణలపై హైడ్రా దృష్టి సారించడంతో జిల్లావాసులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా నగరశివారు ప్రాంతాల్లో ఉన్న చెరువు, కుంటల్లో పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురికావడంతో ఆ చెరువులపైనే అధికారులు దృష్టి సారించారు. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున నగరశివారుల్లోని ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లను నిర్మించుకున్నారు. ఈ ఇండ్లన్నీ చాలా వరకు చెరువులు, కుంటల, పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీంతో తాము, గ్రామాల్లో ఉన్న భూములను అమ్ముకుని ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నామని, అవి కోల్పోతే తమ పరిస్థితి ఏమిటని పేద ప్రజలు వాపోతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో చెరువు, కుంటల్లో అక్రమంగా నిర్మించిన ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. ఇబ్రహీంపట్నం చెరువును హైడ్రా అధికారులు పరిశీలించారు. చెరువు, కుంటల్లో అక్రమంగా నిర్మించిన ఇండ్లను కూల్చివేయనున్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇచ్చి న్యాయం చేస్తాం.
– మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే