బ్యాంకాక్: మూడేళ్లుగా కోమాలో ఉన్న థాయ్‌ల్యాండ్ యువరాణి బజ్రకితియాబా(Princess Bajrakitiyabha) కన్నుమూశారు. ఆమె వయసు 47 ఏళ్లు. డిసెంబర్ 2022లో ఆమె స్పృహ కోల్పోయారు. గుండె పనితీరు రెగ్యులర్‌గా లేని కారణంగా ఆమె గుండె కండరాలకు మైక్రోప్లాస్మా ఇన్ఫెక్షన్ అయ్యింది. థాయ్‌ల్యాండ్ రాచకుటుంబం యువరాణి మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించింది. రాజు వజిరలాంగ్‌కార్న్ పెద్ద కుమార్తె ఆమె. ఆ రాజుకు ఏడు మంది పిల్లలు ఉన్నారు. 1978లో డిసెంబర్ 7వ తేదీన తొలి భార్యకు ఆమె జన్మించారు. వైద్య బృందం ఆ యువరాణికి ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందించింది. కానీ ఆమె క్రమంగా బలహీనమైనట్లు గుర్తించారు.
చూలలోంగ్కార్న్ ఆస్పత్రిలో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. లాయర్‌గా ఆమె శిక్షణ పొందారు. అమెరికాలోని కార్నెల్ వర్సిటీలో ఆమెకు రెండు పీజీ డిగ్రీలు ఉన్నాయి. న్యూయార్క్‌లోని థాయ్ మిషన్‌కు కొన్నాళ్లు పనిచేశారామె. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని అటార్నీ జనరల్ ఆఫీసులో పనిచేశారు. 2021 నుంచి 2014 వరకు థాయ్‌ల్యాండ్ అంబాసిడర్‌గా ఆస్ట్రియా దేశానికి చేశారు. జైలు సంస్కరణలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. మరీ ముఖ్యంగా జైల్లోని మహిళల గురించి ఆమె ఆందోళన చేపట్టారు. థాయ్‌ల్యాండ్‌లో అత్యధిక సంఖ్యలో మహిళా ఖైదీలు ఉన్నారు.
2021లో ఆమె తండ్రి ఆమెకు జనరల్ హోదాను కల్పించారు. ప్రిన్సెస్ బజ్రకితియాబాకు క్రీడలు అంటే ఇష్టం. ఆమె లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌లో పాల్గొనేది. థాయ్ రాజు వజిరలాంగ్‌కార్న్ వయసు 73 ఏళ్లు. ఆయన ఇప్పటి వరకు తన వారుసుడిని ప్రకటించలేదు. ఆ దేశ ఆచారాల ప్రకారం మగవారే వారసత్వాన్ని పొందాల్సి వుంటుంది. కానీ 1974 నాటి రాజ్యాంగ సవరణ ప్రకారం మహిళలు కూడా సింహాసనాన్ని అధిరోహించవచ్చు. రాజు వజిరలాంగ్‌కార్న్ రెండో భార్యకు నలుగురు కుమారులు ఉన్నారు. కానీ వాళ్లు తల్లితో కలిసి అమెరికాలో ఉంటున్నారు. ఇక మూడో భార్యకు ఒక కుమారుడు ఉన్నాడు. కానీ అతను రాచరిక బాధ్యతలు నిర్వర్తిస్తాడో లేదో అన్న సందేహాలు ఉన్నాయి.