తెలుగమ్మాయి శ్రీలీల దక్షిణాదిన సినిమాలు తగ్గించింది. దానికి కారణం విజయాలు లేక కాదు. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ కాన్సన్ట్రేషన్ అంతా బాలీవుడ్ పైనే. సాధారణంగా బాలీవుడ్ సినిమాలు ఏండ్ల తరబడి నిర్మాణాలు జరుపుకుంటూ ఉంటాయి. అందుకే.. కాల్షీట్స్ మధ్య క్లాష్ రాకుండా తాను ఎంతో నమ్మకం పెట్టుకున్న ‘ఆషీకీ 3’ సినిమాకు వీలైనంత ఎక్కువ కాల్షీట్స్ ఇచ్చి, శ్రద్ధంతా ఆ సినిమాపైనే పెట్టింది శ్రీలీల. యూత్‌ని టార్గెట్ చేస్తూ.. విజువల్ వండర్‌గా, అద్భుతమైన మ్యూజిక్‌తో ఓ దృశ్యకావ్యంగా దర్శకుడు అనురాగ్ బసు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
బాలీవుడ్‌లోనూ క్లాసిక్ లవ్‌స్టోరీ వచ్చి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో ‘ఆషీకీ 3’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో శ్రీలీల పాత్ర కీలకంగా ఉంటుందట. అందుకే నటన విషయంలోనూ, లుక్స్ విషయంలోనూ ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నదట. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో వేసిన భారీ సెట్స్‌లో వైభవంగా మొదలైంది. ఈ షెడ్యూల్లో కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలతోపాటు, రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నారు. ‘బాలీవుడ్ తెరపై సత్తా చాటేందుకు ‘ఆషీకీ 3’నే శ్రీలీలకు బలమైన వేదిక’ అంటూ ఆమె అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు.