Kiran Abbavaram | యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్లో సరికొత్త అడుగు వేస్తూ, సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 13వ చిత్రానికి ‘KA13’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచే అధికారికంగా ప్రారంభం కాబోతున్నట్లు చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ప్రకటించింది.
అయితే ఈ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. కిరణ్ అబ్బవరం కేవలం హీరోగానే కాకుండా, ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా స్వయంగా ఆయనే చేపట్టడం విశేషం. దర్శకుడిగా ఆయనకు ఇది సరికొత్త ప్రయాణం కానుంది. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఒక లాడ్జ్ లేదా హోటల్ రిసెప్షన్ డెస్క్‌పై ఉండే బెల్‌ను నొక్కుతున్నట్లుగా ఉన్న ఈ చిత్ర అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే, కిరణ్ అబ్బవరం ఈసారి ఒక విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సస్పెన్స్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.