Raghava Lawrence | ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తన రాజకీయ రంగప్రవేశం గురించి తాజాగా స్పందించాడు. ఈ సందర్భంగా ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోలో ఆయన తన మనసులోని మాటలను పంచుకుంటూ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే విషయాన్ని అభిమానుల నిర్ణయానికే వదిలేశారు. భగవద్గీతలోని ‘సత్కర్మలు చేయి, ఫలితాన్ని ఆశించకు’ అనే సూక్తితో తన ప్రసంగాన్ని ప్రారంభించిన లారెన్స్, ఒక చిన్న కథ ద్వారా నిఖార్సయిన కష్టానికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడని వివరించారు.
తాను తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనే ఆలోచన రావడానికి, అసలు రాజకీయాల వైపు అడుగులు పడటానికి గల కారణాలను ఆయన గుర్తుచేసుకున్నారు. మొదట్లో తాను కేవలం సామాజిక సేవలు, పేదలకు సహాయం మాత్రమే చేసేవాడినని, అయితే జల్లికట్టు ఉద్యమం సమయంలో అక్కడి వారికి ఆహారం అందించినప్పటి నుంచే తన రాజకీయ ప్రయాణానికి పునాది పడిందని చెప్పారు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌పై సీమాన్ చేసిన విమర్శల గురించి ప్రస్తావిస్తూ.. తాను రజనీ వద్దకు వెళ్లి ఈ విషయం చెబితే, ఆయన ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పుడు తాను కూడా పాలిటిక్స్ లోకి వస్తానని చెప్పానని, ఒకవేళ గెలిస్తే పెద్ద ఎత్తున చారిటబుల్ ట్రస్ట్‌లు నిర్మించి సేవ చేయవచ్చని తన అభిమానులు అన్నారని గుర్తుచేసుకున్నారు.
అయితే, తన రాజకీయ ఎంట్రీ గురించి తన తల్లికి చెప్పినప్పుడు ఆమె ముఖం మారిపోయిందని, రెండు మూడు రోజులు తనతో మాట్లాడటం మానేసి, రాజకీయం ఒక మురికికూపం అని వారించారని లారెన్స్ వెల్లడించారు. ఆ సమయంలోనే కరోనా రావడం, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించడం జరిగాయని, ప్రజలకు సేవ చేయలేకపోతున్నందుకు రజనీ ఎంతో బాధపడ్డారని ఆయన అన్నారు. ఆ తర్వాత దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించగానే, తన స్నేహితుడు వస్తున్నాడంటూ తాను ట్రస్ట్ సభ్యులతో కలిసి విజయ్ కోసం పని చేయడం ప్రారంభించానని చెప్పారు. విజయ్ ఎంతో కష్టపడే తత్వమున్న వ్యక్తని కొనియాడారు. అయితే రీసెంట్ గా జరిగిన ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత, విజయ్ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చాడని భావించిన తన తల్లి.. ఇప్పుడు తనను కూడా రాజకీయాల్లోకి వెళ్ళడానికి అనుమతించిందని లారెన్స్ చెప్పుకోచ్చాడు. అమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతూనే, తనకు జన్మనిచ్చిన తల్లితో సమానంగా భావించే తన అభిమానుల అభిప్రాయం కూడా తనకు ముఖ్యమని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలా? అసలు తనకు ఆ అర్హత ఉందా? లేదా? అనే విషయాన్ని అభిమానులే సోషల్ మీడియా కామెంట్ల ద్వారా తెలియజేయాలని రాఘవ లారెన్స్ ఆ వీడియోలో కోరారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత, సీఎం విజయ్ (Vijay) రెండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తిరుచ్చితో పాటు పెరంబూర్ నియోజకవర్గంలో విజయ్ గెలిచాడు. అయితే ఇందులో తిరుచ్చి నియోజకవర్గానికి విజయ్ రాజీనామ చేయగా.. ఆ స్థానంలో టీవీకే తరపున ఎవరు నిలబడతారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే తిరుచ్చిలో టీవీకే నుంచి లారెన్స్ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుండగా.. లారెన్స్ వదిలిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Do your duty sincerely, without expecting anything in return.
After watching this video, please share your advice and guidance in the comments. If you say “No,” I will not enter politics and will continue my selfless service to society. But if you say “Yes,” I am ready to enter… pic.twitter.com/VwPFjdaUqy
— Raghava Lawrence (@offl_Lawrence) June 12, 2026