కందుకూరు మండలంలోని ముచ్చర్ల కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్, గ్రీన్ ఫార్మాసిటీతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయి… ఫార్మాసిటీ ప్రాంత పల్లెలు పట్టణాలుగా అభివృద్ధి చెందనున్నాయి..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో భూ నిర్వాసితులకు మంత్రి ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసి మాట్లాడారు.
ఫార్మాసిటీలో భాగంగా భూములు కోల్పోతున్నవారికి పరిహారంతో పాటు ఇండ్ల స్థలాలను అందజేస్తున్నామన్నారు. భూ నిర్వాసితులు 100 గజాల స్థలం అడిగితే 121 గజాల స్థలాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చారన్నారు. గుంట భూమి కోల్పోయినవారికీ ఇండ్ల స్థలం వచ్చిందన్నారు. లేఅవుట్ చేసిన పక్కన యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, అమెజాన్ వంటి కంపెనీలు వస్తున్నాయన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, సీఎం కేసీఆర్ ప్రజా శ్రేయస్సు కోసమే పని చేస్తారని తెలిపారు.
– కందుకూరు, జనవరి 23
కందుకూరు, జనవరి 23 : రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. మండలంలోని ముచ్చర్ల కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫార్మాసిటీ కోసం భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు మండల పరిధిలోని మీర్ఖాన్పేట్ గ్రామంలో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ పరిహారంతోపాటు ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు. ఫార్మాసిటీలో గ్రామాలు పట్టణాలుగా మారుతాయన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం త్యాగాలు చేసిన రైతుల సేవలు మరువలేనివని కొనియాడారు. గుంట భూమి ఉన్న వారికి కూడా స్థలాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు పెద్దమనస్సుతో 100 గజాల స్థలాన్ని అడిగితే 121 గజాల స్థలం ఇచ్చినట్లు చెప్పారు. హెచ్ఎండీఏ లేఅవుట్ చేస్తున్నట్లు వెల్లడించారు. లేఅవుట్ పక్కన యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, అమేజాన్ వంటి కంపెనీలు వస్తున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఫార్మా సిటీని ఎవ్వరూ వ్యతిరేకించవద్దని కోరారు. మూడు అంచెల సర్టిఫికెట్లు అందజేస్తున్నామని.. సర్టిఫికెట్లను ఎవ్వరూ అమ్ముకోవద్దని సూచించారు. నెల రోజుల్లో స్థలాన్ని చూపుతామన్నారు. పవర్‌గ్రిడ్‌లో భూములు కోల్పోయిన రైతులకు కూడా సర్టిఫికెట్లు ఇస్తామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, ఎంపీపీ జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, సర్పంచ్ జ్యోతి, ఎంపీటీసీలు రాములు, ఇందిరమ్మ దేవేందర్, మాజీ సర్పంచ్ నర్సింహ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, డైరెక్టర్లు ఆనంద్, దేవీలాల్, శేఖర్‌రెడ్డి, మాజీ డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్, తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కల్పన, ప్రజాప్రతినిధులున్నారు.
చెరువుల సుందరీకరణతో ఆహ్లాద వాతావరణం
బడంగ్‌పేట : చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి సబితారెడ్డి అన్నారు. హెచ్ఎండీఏ నిధుల ద్వారా మంజూరైన రూ.4కోట్లతో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నదని పేర్కొన్నారు. బాలాపూర్ మండల పరిధిలో ఉన్న గొలుసుకట్టు చెరువులన్నింటినీ దశలవారీగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. చెరువులు ఎక్కువగా ఉన్నాయని.. ఔట్లెట్ సమస్య ఉందంటే సీఎం కేసీఆర్ స్పందించి ఎన్ని నిధులైనా మంజూరు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు మొట్టమొదట మీర్‌పేటకు సంబంధించిన పెద్ద ఔట్‌లెట్‌కు రూ.23 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు.
బాలాపూర్ మండల పరిధిలోనే చెరువులు, కుంటలు 42 ఉన్నాయన్నారు. హెచ్ఎండీఏ లోపల ఉన్న చెరువులన్నింటికి కూడా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. చెరువులను సుందరీకరణ చేసే క్రమంలో చెరువుల్లో మురుగు నీరు కలువకుండా చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న డీఈ, ఏఈలను ఆదేశించారు. రజకులు, చేపలు పట్టేవారికి, చెరువు కింద ఉన్న కాలనీలు, బస్తీలకు ఎలాంటి సమస్య రాకుండా చర్యలు చేపడుతామన్నారు. గతంలో చెరువు చెరువుకు లింకు ఏర్పాటుకు రూ.1200 కోట్లు మంజూరు చేశారన్నారు. అందులో భాగంగానే రూ.10కోట్లతో జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో మురుగు సమస్య శాశ్వత పరిష్కారం కోసం బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ పైపులైన్ వేసి తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృష్ణ, గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి రెండు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఆలయాలకు పూర్వవైభవం
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆలయాలకు పూర్వవైభవాలు చేకూరుతున్నాయని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ దేవతలగుట్టపై ఏర్పాటు చేయబోయే 30 అడుగుల హనుమాన్ విగ్రహానికి భూమిపూజ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవతలగుట్ట చారిత్రాత్మక ప్రాంతమని పేర్కొన్నారు.
గత సంవత్సరం ఆంజనేయ స్వామి జయంతికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే సంకల్పం కలిగిందన్నారు. విగ్రహ ఏర్పాటుకు కళ్లెం కుటుంబ సభ్యులు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈశ్వరుని పేరుపై మహేశ్వరం నియోజకవర్గం ఉండడంతో కేసీ తండా వద్ద ఒక గుట్టపై 35 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే విగ్రహాన్ని కూడా ప్రారంభించుకుని ప్రజలకు దర్శనార్థం తీసుకొచ్చే అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, మేయర్ పారిజాత, డిఫ్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ జగన్మోహన్, ఏఈ పద్మ, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.