ఫార్మాసిటిలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్ల పంపిణీ త్వరలోనే జరుగనున్నది. సీఎం ఆదేశాల మేరకు రైతులకు ప్లాట్ల పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నరు. ఇప్పటికే మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన లబ్దిదారుల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్లాట్ల లబ్ధిదారుల జాబితాను రైతులకు అందుబాటులో ఉంచారు. త్వరలో లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులకు ప్లాట్లను కేటాయించనున్నారు. జిల్లాలోని కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలోని బేగరికంచె (బల్జగూడ)లో ఫార్మా భూనిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నవి. వెంచర్లో ప్లాట్ల పంపిణీ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేస్తున్నరు. సంక్రాంతి తరువాత లబ్దిదారులకు ప్లాట్లు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నేరుగా ప్రభుత్వమే రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. కందుకూరు మండలం బేగరికంచె వద్ద 620ఎకరాల్లో ఏర్పాటు చేసిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ లేఅవుట్‌ను బ్లాకుల వారీగా ప్లాట్లను తయారుచేశారు. త్వరలోనే డ్రా పద్ధతిలో లబ్ధిదారులకు ప్లాట్లు పంపిణీ చేయాలని ఆదేశించడంతో రైతుల్లో ఒక్కసారిగా ఆశలు చిగురిస్తున్నవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పం త్వరలోనే నెరవేరనున్నది.
– యాచారం, జనవరి11
జిల్లాలోని యాచారం, కందుకూరు మండలాల్లో ముచ్చర్ల కేంద్రంగా ప్రపంచంలోనే అతిపెద్ద హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటిని ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో శ్రీకారం చుట్టింది. దీనికోసం కొంత మేరకు భూసేకరణ సైతం అప్పటి సర్కారు చేపట్టింది. హైదరాబాద్‌కు సమీపంలో 19,333ఎకరాల్లో ఫార్మాసిటిని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దీనికి ఇప్పటికే జాతీయ పెట్టబడి మరియు తయారి జోన్ (నిమ్జ్) హోదాను కేంద్రం కల్పించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి టీఎస్ఐఐసీ (రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ) మండలంలో రైతులనుండి సుమారు 9,500ఎకరాలకు పైగా పట్టా, అసైన్డ్ భూములను సేకరించింది.
ఫార్మాసిటిలో భూములు కోల్పోయిన రైతులకు ముందుగా ఎకరాకు పట్టా భూమికి రూ.12.50లక్షలు, అసైన్డ్ భూమికి రూ.7.70లక్షలు, తరువాత రైతుల డిమాండ్ మేరకు పట్టాకు రూ.16లక్షలు, అసైన్డ్‌కు రూ.8లక్షల పరిహారాన్ని అందజేసింది. ఇంకా 3వేల ఎకరాల భూమికి సంబందించి కోర్టులో కేసులు ఉండటం వలన పరిహారం చెల్లించలేక పోయింది. కొంత మంది రైతులు ఫార్మాసిటికి వ్యవసాయ భూములను ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీంతో అట్టి భూములపై గత కొంత కాలంగా ప్రభుత్వానికి, రైతులకు మధ్యం పోరాటం కొనసాగుతుంది.
ఫార్మా భూ నిర్వాసితులకు పరిహారంతో పాటు అదనంగా కందుకూరు మండలం మీర్ఖాన్పేట గ్రామ సమీపంలోని బేగరికంచె (బల్జగూడ) వద్ద సర్వేనంబర్ 90, 91లో ఎకరాకు 121గజాల చొప్పున పాట్లను ఇచ్చేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎచ్ఎండీఏ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే లబ్దిదారులకు ప్లాట్లకు సంబంధించిన పట్టాలను గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అందజేసిన విషయం తెలిసిందే, బీఆర్ఎస్ హయాంలోనే లబ్దిదారులకు ప్లాట్లు అందజేయాలని అప్పటి ప్రభుత్వం భావించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు లాటరీ ద్వారా పాట్లు కేటాయించే సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో పాట్ల పంపిణీ పక్రియ అక్కడే నిలిచి పోయింది.
యాచారం, కందుకూరు, కడ్తాల మండలాలకు సంబందించిన భూనిర్వాసితులకు ఇళ్ల స్థలాలకు సంబందించి పట్టాలను ఇప్పటికే అందజేసింది. దీనికోసం కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలో బల్జగూడ ప్రాంతంలో సుమారు 622 ఎకరాలలో ఎచ్ఎండీఏ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే అక్కడ భూమి చదును చేసి బ్లాకుల వారీగా ప్లాట్లను తయారు చేసి, రోడ్ల నిర్మాణం సైతం చేపట్టారు. ప్లాట్ల పక్కనే నయానగరి (ఫోర్త్‌సిటి) నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే, ప్రస్తుతం పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంతో రైతులకు ఫార్మా ప్లాట్లపై ఆశలు చిగురించాయి.
యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలకు చెందిన 5720మంది రైతులకు ప్లాట్లు పంపిణీ చేయనున్నారు. ఇందులో యాచారం మండలంలోని నాలుగు గ్రామాలకు కలిపి ఎకరాకు 121గజాల చొప్పున మొత్తం 3745ప్లాట్లు కేటాయించారు. ఇందులో కుర్మిద్ద 1240, నానక్‌నగర్ 359, మేడిపల్లి 1601, తాటిపర్తి 545 గ్రామాల వారిగా పాట్లు మంజూరు చేశారు. రైతుల పేర్లు కెటాయించిన ప్లాట్లకు సంబంధించిన పూర్తి జాబితాను ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులో ఉంచారు. ప్లాట్లకు సంబందించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హులకు ప్లాట్లను అందజేసేందుకు కృషి చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
ఫార్మాపాట్ల లబ్దిదారులు యాచారం మండలంలో మండలం మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, కందుకూరు మండలంలో మండలం మీర్ఖాన్పేట, బేగరికంచె, పంజాగూడ, సాయిరెడ్డిగూడ, అన్నోజీగూడ, ముచ్చర్ల, సార్లరావులపల్లి, కడ్తాల మండలంలో పల్లెచెల్కతండా గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. త్వరలో ఇండ్ల స్థలాలు పంపిణీ చేయనుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాటరీ విధానం ద్వారా ప్లాట్లు కేటాయించి మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి అప్పగించనున్నారు.
ఫార్మా భూనిర్వాసితుల కోసం కేటాయించిన ఇంటి స్థలాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలి. సర్టిఫికెట్లు కలిగిన ప్రతి రైతుకు ఎకరాకు 121గజాల చొప్పున ఇంటి స్థలాలను కేటాయించి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి. లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసి ప్లాట్లు కేటాయించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎచ్ఎండీఏ వెంచర్లో వాటర్ ట్యాంకులు, బడి, పార్కులు, విద్యుత్, భూగర్భ డ్రైనేజీ, రోడ్లను కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేయాలి. రైతులను ఎలాంటి అయోమయానికి గురి చేయొద్దు. ప్రభుత్వం రైతులకు కేటాయించిన స్థలంలో సకల సౌకర్యాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు ప్లాట్లను కేటాయించాలి.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
భూనిర్వాసితులకు ప్లాట్లను డ్రా పద్ధతిలో త్వరలోనే కేటాయిస్తాం. ప్లాట్ల లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదులను పరిశీలించి అర్హులకు ప్లాట్లు అందించేందుకు కృషి చేస్తాం. అర్హులైన లబ్దిదారులకు ఎకరాకు 121గజాల చొప్పున ప్రభుత్వమే రైతుల పేరుమీద మహేశ్వరం సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించి రైతులకు డాక్యుమెంట్ ఇస్తుంది.
– అయ్యప్ప, తహసీల్దార్ యాచారం