హయత్‌నగర్ రూరల్ : పెండ్లికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లయిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బాటసింగారం గ్రామంలో చోటు చేసుకున్నది. సీఐ స్వామి కథనం ప్రకారం.. బాటసింగారానికి చెందిన పురుషోత్తం కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 5వ తేదీ రాత్రి గోస్కొండలోని బంధువుల ఇంటికి వెళ్లారు. 8వ తేదీ తిరిగి ఇంటికి రాగా తలుపులకు వేసిన తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే బీరువాలో దాచిన రూ. లక్ష నగదుతో పాటు రెండు తులాల బంగారం కనిపించ లేదు. ఈ మేరకు బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్వామి తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. క్లూస్‌టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించింది.