సిటీబ్యూరో, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ) : ట్రిపులార్ అగ్గి రాజుకుంటున్నది. అడ్డగోలు అలైన్మెంట్ మార్పులతో భూములు కోల్పోతున్న వందలాది మంది రైతులు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. జీవనాధారం పోతుందని జిల్లాలు దాటి నగరానికి చేరి ఆందోళనలకు దిగుతున్నారు. అక్కడితో ఆగిపోకుండా జాతీయ రహదారిని స్తంభింప జేశారు. దీంతో ఊహించని స్థాయిలో సాగిన ఆం దోళనలతో అమీర్‌పేట స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులకు చిక్కకుండా రోడ్డెక్కిన రైతులతో హెచ్ఎండీఏ కా ర్యాలయానికి గట్టి సెగనే తగిలింది. ఇక రైతుల ఆందోళన విషయాన్ని ముందుగానే తెలుసుకున్న హెచ్ఎండీఏ ఉన్నతాధికారులేవరూ ప్రధాన కార్యాలయంలో లేరని తెలిసింది.
రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ప్రిలిమినరీ
రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను ఆగస్టు నెలాఖరున అధికారిక వెబ్సైట్ లో హెచ్ఎండీఏ ప్రదర్శించింది. ట్రిపులార్ వెళ్తున్న జిల్లాలు, ఆయా మండలాల పరిధిలోని గ్రామాల సర్వేనంబర్లతో జాబితాను విడుదల చేసింది. దీం తో అభ్యంతరాలను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక గడిచిన వారం రోజులుగా రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇన్నాళ్లు పోషించిన విలువైన భూములు దక్కేలా లేవని మదనపడుతున్నారు. ట్రిపులార్ భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు హెచ్ఎండీఏ కార్యాలయాన్ని చేరుకున్నారు. రైతుల తీవ్ర ఆందోళనతో ప్రభుత్వానికి, హెచ్ఎండీఏ కమిషనర్‌కు సెగ తగిలింది.
వివరణ ఇచ్చేదెవరు..?
నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో హెచ్ఎండీఏకు సంబంధమే లేదని సమాచారం. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసం కొంతమంది ఉన్నతాధికారులు అలైన్మెంట్ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను హెచ్ఎండీఏ అధికారిక వెబ్సైట్లో ఉంచారు. అమీర్పేటకొచ్చిన వందలాది మంది రైతులకు అసలు ఆ వెబ్సైట్లో వివరాలను కూడా చూసుకునే వీల్లేకుండా ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఉండడంతో తీవ్ర ఆందోళనకు గుర య్యారు.
ఎవరినీ సంప్రదించాలనే వివరాలు కూ డా హెచ్ఎండీఏ వెబ్సైట్లో లేకపోవడంతో… వందల కిలోమీటర్ల దూరం నుంచి ఉదయాన్నే ఇక్కడకొచ్చామని, అయినా మా గోడు వినేవారు లేరని వాపోయారు. రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల నుంచి వచ్చిన వందలాది రైతులు బృందాలుగా తమ భూములను కాపాడాలంటూ కనిపించిన ప్రతి ఒక్క సిబ్బందినీ కోరాల్సిన దుస్థి తి ఏర్పడింది. రైతులకు సరైన సమాచారం ఇచ్చేవారు లేక అవస్థలు పడ్డారు. ఆవేదనతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
రైతుల ఆగ్రహం.. నిలిచిన ట్రాఫిక్
జిల్లాల నుంచి వచ్చిన రైతులకు సరైన వివరణ ఇచ్చే వారు లేకపోవడంతో వందలాది మంది రైతు లు ప్లకార్డులతో అమీర్‌పేట్‌లోని జాతీయ రహదారిపై బైఠాయించారు. 20 నిమిషాలపాటు సాగిన వారి ఆందోళనను పోలీసులు పసిగట్టలేకపోయా రు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు వారి ఆందోళనను విరమించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఉన్నతాధికారులు కలుగుజేసుకు ని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులను కలిసే ఏర్పా ట్లు చేయడంతో రైతులు వెనక్కి తగ్గారు.
కానీ ఆ లోపే నిరసన ప్రభావం అటు భరత్‌నగర్ వరకు, ఇటు పంజాగుట్ట నిమ్స్ వరకు విస్తరించింది. దీంతో రెండున్నర గంటల పాటు ఈ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. వారిని నియంత్రించేందుకు తగినంత సిబ్బంది లేకపోవడంతో అప్పటికప్పుడు అదనపు సిబ్బందిని మోహరించుకోవాల్సి వచ్చిందనీ పోలీసుల వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. ఈ స్థాయిలో వచ్చిన రైతులకు సమాధానం చెప్పలేక హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు కార్యాలయాలకు దూరంగా ఉండగా..కొందరు ఉన్నతాధికారులు ఆఫీసులోనే ఉండి తమకు సం బంధంలేదని రైతులను అనుమతించలేదు.
నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం లేకుండా, ఎవరికీ ఇవ్వాలో సమాచారం అందుబాటులో ఉంచకుం డా రైతులను గందరగోళానికి కాంగ్రెస్ సర్కారు గురి చేస్తున్నది. సమాచారం ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఎందుకనీ రైతులు మండిపడ్డారు.
కొంతమంది రైతుల నుంచి అధికారులు లిఖితపూర్వకంగా అభ్యంతరాలను స్వీకరించి తాత్కాలికంగా ఊరట కలిగించినా.. సంబంధం లేని వ్యవహారంలో హెచ్ఎండీఏ ఎందుకు తలదూర్చిందనే ది ఇప్పుడు రైతులకు అతిపెద్ద ప్రశ్నగా మారింది. గతంలో ఎప్పుడూ హెచ్ఎండీఏ అధికారులు ఈ ప్రాజెక్టు విషయంలో తమ వద్దకు రాలేదని, ఇప్పుడెందుకూ నోటిఫికేషన్ ప్రచురించారని, ప్రచురించిన నోటిఫికేషన్‌పై వివరణ ఎందుకు ఇవ్వడం లేదంటూ వందలాది మంది రైతులు ప్రశ్నించారు.