రంగారెడ్డి, జూలై 27 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న బహుళ భవనాలతోపాటు కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో మట్టిని పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు. దీనికిగాను జిల్లాలోని అసైన్డ్ భూములతో పాటు ప్రభుత్వ భూముల్లో సైతం పెద్దఎత్తున తవ్వకాలు జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. చీకటి పడితే చాలు వందలాది టిప్పర్లు, లారీలు, జేసీబీలతో పెద్దఎత్తున మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ శివారుల్లోని ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మహేశ్వరం, రాజేంద్రనగర్, కందుకూరు తదితర ప్రాంతాల నుంచి చాటుమాటుగా మట్టి తరలించే కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టి తవ్వకాలు జరిపి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలొస్తున్నాయి. మట్టి మాఫియా చీకటి పడితే చాలు తెల్లవార్లు యథేచ్ఛగా మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అక్రమ మట్టి తరలింపునకు పాల్పడుతున్నవారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన వీరు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపణలొస్తున్నాయి. పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, కడ్తాల్, మాడ్గుల తదితర ప్రాంతాల్లో మట్టి అక్రమ వ్యాపారం జోరుగా సాగుతున్నది. ప్రతి భవన నిర్మాణానికి మట్టి అవసరముంటుండటంతో చాలా మంది ఈ అక్రమ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు.
శివారు ప్రాంతాలైన రాందాస్‌పల్లి, కొహెడ, ఇబ్రహీంపట్నం, ఉప్పరిగూడ, పోచారం, రావిర్యాల, కొంగర, ఆదిబట్ల, తుక్కుగూడ, కందుకూరు, మహేశ్వరం తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వేలాది లారీల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమ మట్టిని తరలిస్తున్న పలు వాహనాలను పోలీసులు పట్టుకుని మైనింగ్ అధికారులకు అప్పగిస్తున్నారు. వారు నామమాత్రపు జరిమానాలు విధించి లారీలు, టిప్పర్లను వదిలేస్తుండటంతో అక్రమ మట్టి వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
టిప్పర్ మట్టికి రూ.6-8వేలు
పైసా పెట్టుబడి లేకుండా అక్రమ మట్టి తరలింపు ద్వారా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు ఆరు నుంచి ఎనిమిదివేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా పెద్దఎత్తున జరుగుతుండటంతో ఇండ్ల నిర్మాణంలో బేస్మెంట్లు నింపడం కోసం మట్టి తప్పనిసరిగా అవసరమవుతున్నది. 600 ఎస్ఎఫ్టీ మట్టి టిప్పర్‌కు రూ.10వేలు, 400 ఎస్ఎఫ్టీ లారీకి 5 నుంచి 6వేల వరకు వసూలు చేస్తున్నట్లు వినికిడి. ఒక్కో వ్యాపారి ప్రతిరోజూ వందల ట్రిప్పుల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.
నామమాత్రంగా కమిటీలు
జిల్లా పరిధిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వ్యాపారులు అసైన్డ్, ప్రభుత్వ భూములను టార్గెట్ చేసుకుంటున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూముల్లో ఉన్న చిన్నచిన్న గుట్టలను సైతం ఎక్కడికక్కడే తొలిచివేస్తున్నారు. అక్రమ మట్టి వ్యాపారాన్ని అడ్డుకోవడం కోసం రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఆ కమిటీలు లక్ష్యానికనుగుణంగా ఏమాత్రమూ పనిచేయడంలేదు. జిల్లావ్యాప్తంగా అక్రమ మట్టి వ్యాపారం యథేచ్చగా సాగుతున్నా అధికారులు అడ్డుకట్ట వేయడానికి ముందుకు రావడంలేదని సర్వత్రా ఆరోపణలొస్తున్నాయి.
రాత్రివేళల్లో సాగిస్తున్న మట్టి వ్యాపారం
అక్రమంగా మట్టిని తరలిస్తున్న వ్యాపారులు రాత్రిపూట తమ పనులను సాఫీగా సాగిస్తున్నారు. చీకటి పడగానే హిటాచీలు, జేసీబీల సహాయంతో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో పెద్దఎత్తున తవ్వకాలు జరుపుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ నగరానికి వేలాది టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలింపు చేపడుతున్నారు. రాత్రి సమయాల్లో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో అక్రమ మట్టి వ్యాపారులు రాత్రి సమయాల్లో తమ పనిని దర్జాగా పూర్తిచేసుకుంటున్నారు. రాత్రి సమయాల్లో వ్యాపారులు ముందుగా ఒక వాహనంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. పోలీసులు, ఇతర అధికారులు ఎవరూ లేరని తెలుసుకుని ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు సమాచారం. వీరు రోజుకు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలుస్తున్నది.
సర్కారు ఆదాయానికి భారీగా గండి
మట్టి విక్రయం కోసం ముందుగా మైనింగ్ అధికారుల అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. పట్టా భూముల్లో మట్టిని తీయడం కోసం క్యూబిక్ మీటర్‌కు కొంత రేటు చొప్పున అధికారులు నిర్ధారిస్తారు. ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టిని తీస్తే అంత ప్రభుత్వానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సర్కారు నుంచి అనుమతి తీసుకున్న మట్టి వ్యాపారులు మైనింగ్ అధికారులు ఇచ్చే రేబీలు చూపించి మట్టిని తవ్వుకోవల్సి ఉంటుంది.
అధికారులు నిర్ధారించిన క్యూబిక్ మీటర్ల సామర్థ్యం వరకే మట్టిని తవ్వాల్సి ఉంటుంది. మట్టి తరలింపు అనుమతులకు అనేక నిబంధనలు అడ్డు రావడంతోపాటు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ రాత్రిపూట యథేచ్ఛగా అక్రమార్కులు మట్టి తరలింపునకు పాల్పడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇండ్ల నిర్మాణాలు, వెంచర్ల ఏర్పాటుకు వందలాది ట్రిప్పుల మట్టి అవసరముంటుంది. ఇందుకుగాను వ్యాపారులు సంబంధీకులతో మట్టిని అందించడానికి ఒప్పందం కుదుర్చుకుని అక్రమ మార్గాల్లో మట్టిని తరలించే పద్ధతికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.