Mrigasira Karthi | చేవెళ్ల టౌన్, జూన్ 8: మృగశిర కార్తెలో చేపలు తింటే మంచిదని పెద్దలు చెబుతుంటారు. దీంతో మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం నాడు చేవెళ్ల మండల కేంద్రంలో చేపల కొనుగోలు కోసం జనాలు పెద్దఎత్తున క్యూకట్టారు.
మృగశిర కార్తె రోజు చేపల కూర తింటే శ్వాస సంబంధితమైన వ్యాధులు నియంత్రించడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నమ్మకం. ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి ఇవాళ చేపలు తినడం ఎంతో మంచిదని అంటారు. దీంతో చేపల మార్కెట్లో రద్దీ పెరిగింది. డిమాండ్ ఎక్కువ కావడంతో ఇవాళ చేపల ధరలను విపరీతంగా పెంచేశారు. చేపలు కిలో రూ.200 నుంచి 250 వరకు పెంచేశారు. మృగశిర కార్తె ప్రారంభంతో పాటు ఆదివారం కావడంతో చేపల ధరలతో పాటు చికెన్ ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఇవాళ కిలో చికెన్ రూ.300 కాగా, నాటు కోడి కిలో రూ.700 వరకు పలికింది.